Joe Biden: వ్యాక్సినేషన్‌ టార్గెట్‌ మిస్‌.. అధ్యక్షుడిపై విమర్శలు

5 Jul, 2021 07:55 IST|Sakshi

వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే పాలనాపరమైన దూకుడును ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్‌పై.. ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో టార్గెట్‌ మిస్‌ అయ్యాడంటూ బైడెన్‌ను ఉతికి ఆరేస్తున్నారు ప్రత్యర్థులు.

వాషింగ్టన్‌: ఎన్నికల వాగ్ధానాల్లో.. అధ్యక్షుడిగా అధికారంలోకి రాగానే బైడెన్‌ చేసిన కీలక ప్రకటన.. అమెరికన్లకు వ్యాక్సిన్‌ డోసులు అందించడం. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 70 శాతం అమెరికన్లను(పెద్దలకు..27 ఏళ్లు పైబడిన వాళ్లు) వ్యాక్సిన్‌ డోసులు అందిస్తానని ప్రమాణం చేశాడు. అందుకే తగ్గట్లే తొలినాళ్లలో ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్‌లతో డ్రైవ్‌ జోరు మాములుగా కనిపించలేదు. అయితే.. 

ఈ ప్రణాళికలో బైడెన్‌ టార్గెట్‌ను చేరుకోలేదని తెలుస్తోంది. జులై 3 నాటి ఫాక్స్‌ న్యూస్‌ రిపోర్ట్ ప్రకారం.. 67 శాతం పెద్దలకు మాత్రమే ఇప్పటిదాకా వ్యాక్సిన్‌ అందినట్లు సమాచారం. అయితే అమెరికాకే చెందిన మరో రెండు ప్రముఖ దినపత్రికలు మాత్రం అది 60 శాతం లోపే ఉందని కథనాలు వెలువరించడం విశేషం. ఇక దాదాపు 35 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో.. 15.7 కోట్ల మందికి పూర్తి డోసులు, 18.2 కోట్ల మందికి ఒక్క డోసైన అంది ఉంటుందని మీడియా గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు..

ఇతర దేశస్తులకు వ్యాక్సిన్‌లు డోసులు అందినప్పటికీ, వాటిలో చాలావరకు లెక్కలకు తీసుకోకపోవడం.. ఈ కారణం వల్లే అమెరికన్లను డోసులు పూర్తిగా అందలేదని, పైగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లెక్కల్లో గందరగోళం నెలకొందని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రా నుంచి పూర్తి స్థాయిలో నివేదికలు అందలేదన్న వైట్‌హౌజ్‌ ప్రతినిధి వ్యాఖ్యలతో మీడియా కథనాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

కరోనా యుద్ధం ముగియలేదు
నన్ను తప్పుగా అనుకోకండి.. కరోనాతో యుద్ధం ఇంకా ముగియలేదు. డెల్టా లాంటి రకరకాల వేరియెంట్లు పుట్టుకొస్తున్నాయి అని అమెరికా ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించాడు. వెయ్యి మంది అతిథుల మధ్య వైట్‌ హౌజ్‌లోని జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘245 ఏళ్ల క్రితం బ్రిటిష్‌చెర నుంచి ‍స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. అలాగే ఇవాళ ప్రమాదకరమైన కరోనా వైరస్‌ నుంచి విముక్తి కోసం పోరాటంలో చివరి దశకు చేరుకున్నాం. పోరాటం ఆపొద్దు. వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలి’’ అని జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు బైడెన్‌.

మరోవైపు అమెరికా వ్యాప్తంగా సంబురాలు మాత్రం అంబురాన్ని అంటాయి. మాస్క్‌లు లేకుండా గుంపులుగా జనాలు వేడుకలు చేసుకున్నారు. పబ్‌లలో, బీచ్‌లలో కోలాహలం కనిపించింది. ఇక భారత ప్రధాని మోదీ సహా పలు దేశాల అధినేతలు అమెరికన్లను శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు