Miami Building Collapse: గుండెలు పగిలేలా రోదనలు.. ఇక సజీవ సమాధిగా మిగిలేనా?

2 Jul, 2021 11:08 IST|Sakshi

తమవాళ్లు ఏమైపోయారో అని కొందరి రోదనలు. తమవాళ్లు మృత్యుముఖం నుంచి బయటపడతారేమోనని ఆశతో మరికొందరు. ఇంకొందరు సహాయక బృందాలతో కలిసి వెతుకులాట.. మియామీ బిల్డింగ్‌ కూలిన ఘటనాస్థలంలో కనిపిస్తున్న దృశ్యాలివే. అయితే నిమిషాల వ్యవధిలో జరిగిన దుర్ఘటన వందకు పైగా కుటుంబాల్లో పెనువిషాదం నింపేలా కనిపిస్తోంది. అయితే ఇప్పటిదాకా 150 మందికిదాకా ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన నెలకొంది. మరోపక్క సహాయక చర్యలను నిలిపివేయాలన్న ఆదేశాలతో బాధిత కుటుంబాలు రోదనలు మిన్నంటుతున్నాయి. 

ఫ్లోరిడా: మియామీ బీచ్‌ సమీపంలోని ఛాంప్లెయిన్‌ టవర్స్‌లో మొత్తం 136 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వాటిలో 55 అపార్ట్‌మెంట్లు గత గురువారం రాత్రి(బుధవారం అర్థరాత్రి దాటాక 1గం.30ని. సమయంలో) కుప్పకూలిపోయాయి. ఆ మరుసటి ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనను 9/11 విషాదంతో పోలుస్తున్నారు కొందరు. కాగా, ఈ ఘటనలో ఇప్పటిదాకా 18 మృతదేహాలను వెలికితీయగా(పిల్లలు కూడా ఉన్నారు).. గాయపడ్డ ఇరవై మందికి పైగా ఆస్పత్రికి తరలించారు. ఇంకా 145 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే శిథిలాల కింద కొందరైనా ప్రాణాలతో ఉండొచ్చేమోనన్న ఆశతో గాలింపు చర్యలు చేపట్టారు. స్నిఫర్‌ డాగ్స్‌, రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ సహాయక కార్యక్రమంలో సెలబ్రిటీలు, స్కూల్‌ పిల్లలు సైతం స్వయంగా వచ్చి పాల్గొనడం విశేషం. మరోపక్క అంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ తరుణంలో..

శకలాల తొలగింపు నిలిపివేత
మియామీ దుర్ఘటనలో శకలాల తొలగింపును నిలిపివేయాలని సర్ప్‌సైడ్‌ మేయర్‌ ఛార్లెస్‌ బర్కెట్‌ శుక్రవారం ఉదయం ఆదేశించాడు. ఓవైపు తుఫాన్‌ హెచ్చరికలు.. మరోపక్క శకలాలను తొలగించే క్రమంలో ఒరిగిపోయి ఉన్న మిగిలిన అపార్ట్‌మెంట్‌ భాగం కూలిపోయే ప్రమాదం ఉందని ఇంజినీర్‌లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పనులు ఆపేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతంలో శోక మేఘాలు అలుముకున్నాయి. తమ వాళ్లను శకలాల కిందే చావనివ్వకండని అధికారుల్ని వేడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

బైడెన్‌ సంఘీభావం
కాగా, ఘటనాస్థలాన్ని గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సందర్శించాడు. బాధితుల కుటుంబాలను ఓదార్చడంతో పాటు సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాడు. కనీసం తమవాళ్ల శవాలైనాన అప్పగించాలని కొందరు బైడెన్‌ను వేడుకోవడం అందరినీ కలిచివేసింది. ఈమేరకు అక్కడి దీనగాథల్ని, పరిస్థితుల్ని వివరిస్తూ.. బైడెన్‌ ట్విటర్‌లో పోస్ట్‌లు చేశారు.

కారణాలేంటసలు.. 
ప్రస్తుతం ఈ బిల్డింగ్‌ ఉన్న స్థలం ఒకప్పుడు సముద్రపు నీట మునిగి ఉన్న స్థలం అని.. 40 ఏళ్ల క్రితం ఈ బిల్డింగ్‌ను నిబంధనలకు విరుద్ధంగా కట్టారనేది నిపుణుల అభిప్రాయం. అంతేకాదు 2018లో బిల్డింగ్‌ బేస్‌మెంట్‌ బాగా దెబ్బతిందని, ఆ ప్రభావం గోడల మీద కూడా కనిపిస్తోందని ఓ ఇంజినీర్‌ రిపోర్ట్‌ ఇచ్చాడు కూడా. అయితే కుట్ర కోణాలను,  ఆరోపణలను, అభిప్రాయాలను అధికారులు ఖండిస్తున్నారు. దుర్ఘటన కారణాలపై ఇప్పుడు నిర్ధారణకే రాలేమని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: మియామీ దుర్ఘటన.. కుట్ర కోణం?.. ఆయన సూసైడ్‌తో లింక్‌!

మరిన్ని వార్తలు