ట్రంప్‌కు కరోనా!

3 Oct, 2020 05:05 IST|Sakshi
త్వరగా కోలుకుంటా..

మెలానియాకు కూడా కరోనా పాజిటివ్

క్వారంటైన్‌లో దంపతులు

పోటెత్తిన పరామర్శలు

విధిరాతకు చిన్నా పెద్దా, పేదా గొప్పా తారతమ్యం లేదని కరోనా మరోమారు రుజువు చేసింది. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెబుతూ వచ్చిన అగ్రరాజ్యాధిపతి స్వయంగా దాని బారిన పడ్డారు. మాస్కు పెట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తూ వచ్చిన పెద్దన్న చివరకు క్వారంటైన్‌ గూటికి చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోవిడ్‌ బారిన పడటం ట్రంప్‌నకు షాక్‌ అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్‌తో డిబేట్‌లో పాల్గొన్న బైడెన్‌కు కూడా కరోనా వస్తుందా? ఒకవేళ వస్తే ప్రధాన అభ్యర్థులిద్దరూ క్వారంటైన్‌లో ఉంటే ఎన్నికలు ఎలా జరుగుతాయి? నూతన అభ్యర్థులు రంగంలోకి వస్తారా? ఎన్నికలు వాయిదా పడతాయా? ఇలాంటి పలు ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(74), ఆయన భార్య మెలానియా ట్రంప్‌నకు కరోనా సోకింది. తామిద్దరికీ కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, తక్షణమే ఇరువురం క్వారంటైన్‌ ఆరంభిస్తున్నామని ట్రంప్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. కలిసికట్టుగా తామిద్దరం దీన్ని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ట్రంప్‌నకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ చేసుకున్నట్లు అధ్యక్షుడి ఆస్థాన వైద్యుడు సీన్‌ కొన్లే చెప్పారు. ప్రస్తుతం ట్రంప్, మెలానియా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వైట్‌హౌస్‌లోనే వారి క్వారంటైన్‌ జరుగుతుందని చెప్పారు.

వైట్‌హౌస్‌ వైద్యుల బృందం, తాను ఎప్పటికప్పుడు వీరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామన్నారు. రికవరీ దశలో అధ్యక్షుడు తన కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తాను వెల్లడిస్తానని చెప్పారు. ట్రంప్‌ సలహాదారు హోప్‌ హిక్స్‌కు ఒక్కరోజు క్రితమే కరోనా సోకినట్లు పరీక్షలో వెల్లడయింది. హోప్‌ ఎన్నికల కోసం చాలా కష్టపడుతున్నదని, తనకు కరోనా సోకినట్లు తెలిసిందని ట్రంప్‌ గురువారం ట్వీట్‌ చేశారు. హోప్‌కు కరోనా రావడంతో తను, మెలానియా కోవిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్నామని తెలిపారు.

ఇటీవలే ప్రెసిడెంట్‌తో కలిసి హోప్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయా ణం చేసింది. ఎన్నికల ప్రచారం జోరు గా సాగుతున్న తరుణంలో ట్రంప్‌నకు కరోనా సోకడం ఆయన ప్రచార కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కరోనా సోకడంతో ట్రంప్‌ బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అనేకమంది తోటి అమెరికన్లు కరోనా బారిన పడ్డట్లే తామూ కరోనా బారినపడ్డామని, ఇద్దరం కలిసి దీన్ని జయిస్తామని మెలానియా ట్వీట్‌ చేశారు. ఇటీవల కాలంలో పలువురు వైట్‌హౌస్‌ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు యూఎస్‌లో కరోనా కారణంగా దాదాపు 2 లక్షల మరణాలు సంభవించాయి.

వయోభారం, భారీ కాయం..
అమెరికా అధ్యక్షుల్లో దశాబ్దాల కాలంలో ఎవరూ ఎదుర్కోని సీరియస్‌ ఆరోగ్యసమస్యను ట్రంప్‌ ఎదుర్కొంటున్నారని సీఎన్‌ఎన్‌ వ్యాఖ్యానించింది. 74 ఏళ్ల వయసు, ఒబేసిటీతో ఆయన కరోనా బాధితుల్లో అత్యధిక రిస్కు జోన్‌లో ఉన్నారని తెలిపింది. వయసు పెరిగే కొద్దీ కరోనా బాధితుల్లో రిస్కు పెరుగుతుందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ గైడ్‌లైన్స్‌ చెబుతున్నాయి. ఉదాహరణకు 50ల్లో ఉన్న వారికి 40ల్లో ఉన్నవారితో పోలిస్తే తీవ్ర అస్వస్థతకు గురయ్యే చాన్స్‌ అధికమని, అదేవిధంగా 60, 70ల్లో ఉన్నవాళ్లకు మరింత రిస్కని తెలిపింది. ట్రంప్‌ ఆరోగ్యం  గానే ఉన్నా, అధిక బరువు ఉన్నందున కరోనా సోకితే  ఊపిరితిత్తులకు ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దీనికితోడు ట్రంప్‌ మాస్కు వాడకానికి వ్యతిరేకి.  కానీ, ర్యాలీల అనంతరం ప్రతిసారీ ట్రంప్‌ కోవిడ్‌ పరీక్ష చేయించుకునేవారు. త్వరలో ఈ సమస్య సమసిపోతుందని చెప్పేవారు. అనూహ్యంగా ఆయనే కరోనా బారిన పడ్డారు.

ప్రముఖుల పరామర్శ
అగ్రరాజ్యాధిపతికి కరోనా రావడంపై వివిధ దేశాల అధినేతలు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘నా స్నేహితుడు, ఆయన భార్య తొందరగా రికవరీ కావాలి, మంచి ఆర్యోగంతో ఉండాలి’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. లక్షలాది మంది అమెరికన్లతో పాటు తాను కూడా ట్రంప్‌ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు యూఎస్‌ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ చెప్పారు. ఈ కష్టకాలంలో ట్రంప్‌నకు తన పూర్తి మద్దతు ఉంటుందని రష్యా అధినేత పుతిన్‌ ప్రకటించారు. ట్రంప్‌ వేగంగా రికవరీ కావాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కోరారు. అమెరికాలోని పలు రాష్ట్రాల గవర్నర్లు సైతం ట్రంప్‌ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు.

ఆస్ట్రేలియా వ్యవసాయ మంత్రి, టోక్యో గవర్నర్, ప్రపంచ మీడియా సంస్థలు ట్రంప్‌ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించాయి. కరోనాపై ట్రంప్‌ మొదటినుంచీ విరుచుకుపడుతున్నా చైనా నుంచి మాత్రం ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. చైనా సోషల్‌ మీడియోలో మాత్రం ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు కనిపించాయి. ట్రంప్‌ పూర్తిగా కోలుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గ్యుటెర్రస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ఆకాంక్షించారు.  కరోనా వైరస్‌ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.  


మాస్కు ధరించడం ఇష్టపడని ట్రంప్‌ను కరోనా ఇష్టపడిందంటూ కొందరు వెటకారంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. విమర్శించే ట్రంప్‌ ఎట్టకేలకు ఒక విషయాన్ని ‘పాజిటివ్‌’గా ట్వీట్‌ చేశారని ఓ చైనీయుడు జోక్‌ చేశారు. కోవిడ్‌ బాధితులకు క్రిమిసంహారక(డిస్‌ఇన్ఫెక్టెంట్‌) మందులు ఇంజెక్షన్‌ చేయాలని ట్రంప్‌ గతంలో అన్నారు కనుక ఇప్పుడు వాటిని తీసుకునే సమయం ట్రంప్‌నకు వచ్చిందని జపాన్‌ ఇంటర్నెట్‌ వ్యాపారి హిరోయుకి నిషిమురా వ్యాఖ్యానించారు.  

తొలి నుంచీ నిర్లక్ష్యమే!
కరోనా విపత్తు ఆరంభం నుంచి ట్రంప్‌ నిర్లక్ష్య వైఖరినే చూపుతూ వచ్చారు. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని, మాస్కు అవసరం లేదని, ఎకానమీని షట్‌డౌన్‌ చేయక్కర్లేదని చెప్పడమే కాకుండా కరోనాపై జాగ్రత్తలు చెప్పినవాళ్లను ఎగతాళి చేశారు. కానీ చివరకు తానే దాని బారిన పడ్డారు. ప్రజలు ఎక్కువగా భయపడకుండా ఉండేందుకే తాను కరోనాను తక్కువ చేసి చూపానని ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. జనవరి 21న యూఎస్‌లో తొలి కరోనా కేసు నమోదయింది. అప్పటి నుంచి కరోనాపై ట్రంప్‌ చేసిన కీలక వ్యాఖ్యలు..

జనవరి:  కరోనా సంక్షోభం ప్రపంచవ్యాప్త సంక్షోభంగా మారదు. అమెరికాలో కరోనా పూర్తి నియంత్రణలో ఉంది.
ఫిబ్రవరి: ఏప్రిల్‌ కల్లా వేసవి ఆరంభం కాగానే కరోనా మాయమవుతుంది. కరోనా మహ్మమారి తాత్కాలికమే. ఒక్కమారుగా మాయమవుతుంది.
మార్చి: అమెరికన్లకు కరోనా రిస్కు చాలా తక్కువ.
జాతీయ ఎమర్జెన్సీ అనవసరం. కానీ విధించక తప్పట్లేదు.
ఏప్రిల్‌: కరోనా వైరస్‌ సోకినవారు డిస్‌ఇన్ఫెక్టెంట్‌ను ఇంజెక్షన్‌గా తీసుకుంటే చాలా వేగంగా మళ్లీ ఆరోగ్యవంతులుగా మారడం ఖాయం
మే: పిల్లల్లో కరోనా ప్రభావం చాలా తక్కువ. షట్‌డౌన్‌ కొనసాగిస్తే కోవిడ్‌ మరణాల కంటే ఇతర కారణాలతో∙ ఎక్కువ మరణాలు సంభవిస్తాయి.
జూన్‌: కరోనా మరణాలు తగ్గిపోతున్నాయి. దేశంలో పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉంది. కరోనా కేసుల్లో 99% ప్రమాదరహితాలు.
జూలై: ప్రపంచంలో అమెరికాలోనే కరోనా మరణాలు తక్కువ.
సెప్టెంబర్‌: మాస్కు పెట్టుకొని దేశాధినేతలను కలవడం అమర్యాద. అధ్యక్ష పోటీదారు బైడెన్‌లాగా నేను మాస్కు ధరించను.  

పెన్స్‌ చేతికి పగ్గాలు??
ప్రస్తుత అధ్యక్షుడు కరోనా బారిన పడడంతో అమెరికా రాజకీయరంగంలో మార్పులు జరగవచ్చని రాజకీయ నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు.  అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలైతే యూఎస్‌ రాజ్యాంగం ప్రకారం వైస్‌ ప్రెసిడెంట్‌ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చు. వైస్‌ప్రెసిడెంట్‌ కూడా బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితులుంటే, స్పీకర్‌ ఆఫ్‌ హౌస్‌ తాత్కాలిక బాధ్యతలు చేపడతారు. అయితే, ఒకపక్క అధ్యక్ష ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది, కీలక పార్టీలు  అభ్యర్థులను ప్రకటించేశాయి. హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతల బదిలీ ఉండకపోవచ్చని మరికొందరి  అంచనా. అధ్యక్ష అభ్యర్ధులు ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలై నామినేషన్‌ ఉపసంహరించుకోవాల్సి వస్తే పార్టీలకు సైతం అగ్ని పరీక్ష ఎదురుకానుంది.

కొత్తగా మరో అభ్యర్థిని ఎంచుకొని, వారితో  ప్రచారం నిర్వహించాల్సి వస్తుంది. ఇవన్నీ కలగలసి అమెరికా రాజకీయ యవనికపై పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలేనని, పరిస్థితి అంతదూరం రాకపోవచ్చని ఎక్కువమంది అంచనా. ట్రంప్‌ వేగంగా కోలుకోకపోతే మాత్రం పెన్స్‌ చేతికి పగ్గాలు తాత్కాలికంగానైనా వచ్చే అవకాశాలున్నాయి. రాజ్యాంగానికి జరిపిన 25వ సవరణ ప్రకారం అధ్యక్షుడు తాను బాధ్యతలు నిర్వహించలేనని ప్రకటిస్తే ఉపాధ్యక్షుడు తాత్కాలిక బాధ్యతలు చేపడతారు. తిరిగి అధ్యక్షుడు తాను బాగానే ఉన్నానని స్వయంగా చెప్పేవరకు ఉపాధ్యక్షుడు అధ్యక్ష వ్యవహారాలు చూస్తాడు.  

గతంలో ఎప్పుడు?
► 1985లో రొనాల్డ్‌ రీగన్‌ శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జార్జ్‌  డబ్లు్య బుష్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించారు.  
► 2002, 2007లో కొలనొస్కోపి చేయించుకోవాల్సిన సమయంలో అప్పటి అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ తన బాధ్యతలు, అధికారాలను డిక్‌ చెనీకి తాత్కాలికంగా బదలాయించారు.  

రెండో ఆప్షన్‌
అధ్యక్షుడు తన బాధ్యతలు, అధికారాలు స్వయంగా తాత్కాలికంగా ఉపాధ్యక్షుడికి బదలాయించడం కాకుండా కేబినెట్‌లో మెజార్టీ సభ్యులు, ఉపాధ్యక్షుడు తమకు తామే ఇలాంటి బదలాయింపును ప్రకటించవచ్చని యూఎస్‌ రాజ్యాంగ నిపుణులు వెల్లడించారు. అధ్యక్షుడు బాధ్యతలు నిర్వహించలేడని భావించిన పక్షంలో కేబినెట్‌లో అధికులు, ఉపాధ్యక్షుడు కలిసి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ యూఎస్‌లో ఇలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఈ ఆప్షన్‌ ఉపయోగించాలంటే పెన్స్‌తో సహా కేబినెట్‌లోని సీనియర్స్‌ 15 మందిలో 8మంది ట్రంప్‌ బాధ్యతలు నిర్వహించలేరని భావించాల్సిఉంటుంది. ఈ నిర్ణయాన్ని ట్రంప్‌ అంగీకరించకున్నా సెనేట్, హౌస్‌లు ఆమోదిస్తే వాస్తవ రూపం దాలుస్తుంది. పెన్స్‌ యత్నాలను ట్రంప్‌ ముందే గమనిస్తే ట్రంప్‌ తనను ముందే డిస్మిస్‌ చేయవచ్చు. మరోవైపు ట్రంప్‌ అనారోగ్యంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయని కొందరు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటికే ఓటింగ్‌ ఆరంభమైనందున వాయిదా సాధ్యం కాదని ఎక్కువమంది అంచనా. రాజ్యాంగంలో ఎన్నికల తేదీ గురించి ఎక్కడా ప్రకటించలేదు. అందువల్ల ఎన్నికలు వాయిదా వేయాలంటే అటు సెనేట్, ఇటు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ ఆమోదం తెలపాల్సిఉంటుంది. ఎన్నికలతో సంబంధం లేకుండా ట్రంప్‌ పదవీ కాలం వచ్చే జనవరి 20తో ముగియనుంది.   

బైడెన్‌కు నెగెటివ్‌
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జో బైడెన్‌కు, ఆయన భార్య జిల్‌ ట్రేసీ జాకొబ్‌ బైడెన్‌కు శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ పరీక్షలో ఇద్దరికీ నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు కరోనా సోకినట్లు తేలడంతో బైడెన్‌ దంపతులకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ కెవిన్‌ ఓ కానర్‌ తెలిపారు. రెండు రోజుల క్రితమే ట్రంప్, బైడెన్‌ల మధ్య చర్చా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కరోనా నెగటివ్‌ అని తేలడంతో ప్రచార కార్యక్రమాలను కొనసాగించాలని బైడెన్‌ నిర్ణయించారు. ప్రచారంలో భాగంగా ఆయన మిషిగన్‌కు వెళ్లనున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా