ప్రేమ, పెళ్లి, అంతలోనే వరుస విషాదాలు..

25 Sep, 2020 15:03 IST|Sakshi

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న జో బైడెన్‌

బాల్యం భారంగానే గడిచింది

ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే విషాదం

2015లో పెద్ద కుమారుడిని కోల్పోయిన బైడెన్‌

బైడెన్‌పై కూడా వేధింపుల ఆరోపణలు

30 ఏళ్ల కల నెరవేరుతుందా?

(వెబ్‌ స్పెషల్‌): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబిక్లన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఢీకొట్టేందుకు డెమొక్రాట్ల తరఫున రంగంలోకి దిగిన జో బైడెన్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రెసిడెంట్‌ పదవికి పోటే పడే అర్హత సాధించిన ఆయన, అదే జోరును కొనసాగిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ట్రంప్‌ వలస విధానాలపై విరుచుకుపడే బైడెన్‌, అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికల్లో తనతో పోటీపడిన కమలా హారిస్‌ను రన్నింగ్‌ మేట్‌గా ప్రకటించి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఇటీవల తీవ్ర నిరసనలకు కారణమైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతం నేపథ్యంలో ఆఫ్రికా- ఆసియా మూలాలున్న మహిళకు ప్రాధాన్యమిచ్చి నల్లజాతీయుల మద్దతు కూడగట్టుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి ‘రేసిస్ట్‌’ దాడులు ఉండవని, సమానత్వ భావన గల జాతిని పునర్నిర్మిస్తామంటూ ప్రసంగాలు చేస్తున్నారు. 

అదే విధంగా పాలనలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి ప్రస్తావిస్తూ శ్వేతజాతి ఓటర్లను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో ట్రంప్‌ యంత్రాంగం వ్యవహరించిన తీరును ఎండగడుతూ, 2 లక్షలకు పైగా అమెరికన్లకు మృతికి కారణమైన వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయలేకపోయారంటూ బైడెన్‌ విరుచుకుపడుతున్నారు. కరోనా మృతుల్లో మన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు, పిల్లలు ఉన్నారని, వాళ్లంతా ‘అమెరికన్లే’ మిస్టర్‌ ప్రెసిడెంట్‌ అంటూ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. స్పానిష్‌ ఫ్లూ, అమెరికా పౌరయుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కోవిడ్‌-19 దేశంపై తీవ్ర ప్రభావం చూపిందని, ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ట్రంప్‌, మహమ్మారిని తేలికగా తీసుకున్నారంటూ చురకలు అంటిస్తున్నారు. (చదవండి: ఏనుగు లేదా గాడిద: ఎవరిది పైచేయి?!)

అంతేగాక కరోనా కారణంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తిన తరుణంలో ఏసీఏ చట్టాన్ని(పేషెంట్‌ ప్రొటెక‌్షన్‌ అండ్‌ అఫార్డబుల్‌ కేర్‌ యాక్ట్‌)ను నీరుగార్చి సుమారుగా 23 మిలియన్‌ మంది అమెరికన్లను కవరేజ్‌ కోల్పోయేలా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ‘‘సేవ్‌ హెల్త్‌కేర్‌’’ అంటూ బైడెన్‌ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇలా ట్రంప్‌ పాలనలో వైఫల్యాన్నింటినీ ఎత్తిచూపుతూ ప్రచార జోరు పెంచిన జో బిడైన్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారా లేదా రాజకీయాలకు పనికిరారని తాను విమర్శించిన వ్యక్తి చేతిలోనే ఓడిపోయి మరోసారి ఆయనకే శ్వేతసౌధ పగ్గాలు అప్పగిస్తారా అన్నది చర్చనీయాంశం. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న బైడెన్‌ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కొన్ని వివరాలు మీకోసం. 

బాల్యం భారంగానే..
జో బైడెన్‌ పూర్తి పేరు జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ జూనియర్‌. పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో నవంబరు 20, 1942లో జన్మించారు. ఆయనకు ఓ సోదరి, ఇద్దరు సోదరులు ఉన్నారు. బైడెన్‌ తండ్రిది సంపన్న కుటుంబమే గానీ, మొదటి సంతానం జన్మించేనాటికి తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో మునిగిపోయారు. అప్పుడు తన భార్య తల్లిదండ్రులే ఆయనకు అండగా నిలబడ్డారు. అయితే 1950 నాటికి స్క్రాంటన్‌లో ఆర్థిక మాంద్యం కారణంగా పరిస్థితులు పూర్తిగా చేయిదాటి పోవడంతో డెలావర్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే కార్ల బిజినెస్‌ మొదలుపెట్టి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. సగటు మధ్యతరగతి తండ్రిగా తన పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు అమర్చిపెట్టారు. కాగా బిడైన్‌ విద్యాభ్యాసం డెలావర్‌లోనే సాగింది. చదువులో అంతంతమాత్రంగానే ఉన్నా, ఆటపాటల్లో ప్రావీణ్యం కనబరిచే బైడెన్‌ తోటి విద్యార్థుల మనసు చూరగొని అనేకమార్లు క్లాస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. పొలిటికల్‌ సైన్స్‌ చదివిన బైడెన్‌ 1965లో యూనివర్సిటీ ఆఫ్‌ డెలావర్‌ నుంచి పట్టా పుచ్చుకున్నారు. (చదవండి: ఇంతవరకు ఎవరికీ ఆ ఛాన్స్‌ రాలేదు!)

ప్రేమ, పెళ్లి.. అంతలోనే..
న్యాయ విద్యనభ్యసించే సమయంలో నిలియా హంటర్‌ అనే సహవిద్యార్థినితో ప్రేమలో పడిన బైడెన్‌ ఆగష్టు 27, 1966లో ఆమెను పెళ్లిచేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కొడుకులు జోసెఫ్‌ ఆర్‌ బైడెన్‌ 3, రాబర్ట్‌ హంటర్‌లతో పాటు కుమార్తె నయోమి క్రిస్టియానా జన్మించారు. అయితే చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న జో బైడెన్‌ ఎలాగైనా సెనేటర్‌గా ఎన్నికై, రాజకీయంగా ఎదిగి ఏనాటికైనా అధ్యక్షుడిని కావాలనేదే తన లక్ష్యమని భార్యకు చెప్పేవారట. అందుకు తగ్గట్టుగానే నిలియా సైతం భర్తకు అండగా నిలుస్తూ ఆయనను ప్రోత్సహించేవారట. 

ఈ క్రమంలో బిడెన్ రాజకీయ ప్రస్థానం 1973లో మొదలైంది. ఆయన తొలిసారిగా సెనేట్‌కు పోటీచేస్తున్న సమయంలోనే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంతగానో ప్రేమించే తన భార్యాపిల్లలకు ఘోరమైన ఆక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటనలో బైడెన్‌ భార్య నిలియా, కూతురు నియోమి మరణించగా, కుమారులిద్దరూ తీవ్ర గాయాలతో బయపటడ్డారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలబడటంతో మూడేళ్ల తర్వాత నెమ్మదిగా గత జ్ఞాపకాల నుంచి బయటపడ్డారు. 

పునర్వివాహం- వెంటాడిన విషాదం
విద్యాధికురాలైన జిల్‌ ట్రేసీ జాకబ్స్‌ను బైడెన్‌ 1975లో కలిశారు. తన సోదరుడు చెప్పిన వివరాలు నచ్చడంతో ఆమె గురించి వాకబు చేశారు. ఈ క్రమంలో రెండేళ్ల పాటు డేటింగ్‌ చేసి 1977లో ఆమెను పెళ్లాడారు. 1988లో బ్రెయిన్‌కు సంబంధించి మేజర్‌ ఆపరేషన్‌ జరిగిన సమయంలో బైడెన్‌ను ఆమె కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కాగా వీరిద్దరికి ఆష్లే బ్లేజర్‌ సంతానం. ఆమె సోషల్‌ యాక్టివిస్టు. ఇక బైడెన్‌ పెద్ద కుమారుడు బ్యూ డెలావర్‌ అటార్నీ జనరల్‌గా, ఆర్మీ జడ్జ్‌ అడ్వకేట్‌గా పనిచేశాడు. 20 ఏళ్ల పాటు బ్రెయిన్‌ కాన్సర్‌తో పోరాడి 2015, మే 30న కన్నుమూశాడు.

ఇక చిన్న కుమారుడు హంటర్‌ వాషింగ్టన్‌ అటార్నీగా, లాబియిస్ట్‌గా ఉన్నాడు. వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నాడు. కాగా హంటర్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడని, వ్యాపారకలాపాల్లో భాగంగా ఆయన అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌, బైడెన్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. (చదవండి: చైనా కంపెనీలతో బైడెన్‌ కుమారుడికి వ్యాపార సంబంధాలు!)

రాజకీయ జీవితం
డెలావర్‌ సెనేటర్‌గా పనిచేసిన బైడెన్‌ 1987లో తొలిసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం ప్రచారం చేశారు. వాక్చాతుర్యంతో ఓటర్లను ఆకర్షించే ఆయన డెమొక్రటిక్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే అమెరికా అధ్యక్షుడు కావాలన్న ఆయన కల మాత్రం ఇంతవరకు నెరవేరలేదు. 1988లో తొలిసారి అభ్యర్థిత్వ బరిలో నిలిచారు. సుమారు ముప్పై ఏళ్లపాటు అమెరికా సెనెట్‌లో కీలక వ్యక్తిగా ఉన్న బైడెన్‌, బరాక్‌ ఒబామా హయాం(2008, 2012)లో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆ సమయంలో తాను అవలంబించిన విధానాల వల్ల రిపబ్లికన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక 1991 గల్ఫ్ యుద్ధానికి వ్యతిరేకంగా ఓట్‌ వేయడం వంటి విధానాల వల్ల డెమొక్రాట్‌ పార్టీ యువ నాయకులకు దూరమయ్యారు. 

వివాదాస్పద వాఖ్యలు- ఆరోపణలు
జో బైడెన్‌ తమను తాకరాని చోట తాకారంటూ 8 మంది మహిళలు ఆరోపించారు. భుజాలు తడమటం, చేతులు గట్టిగా పట్టుకోవడం, దగ్గరకు లాక్కొంటూ అసౌకర్యం కలిగించడం, ఆలింగనం చేసుకునే క్రమంలో అసభ్యంగా ప్రవర్తించడం, మెడపై చేతులు వేసి అసౌకర్యానికి గురిచేస్తూ వేధింపులకు పాల్పడ్డారని పలు సందర్భాల్లో ఆయన‌పై ఆరోపణలు చేశారు. ఇక అలెగ్జాండ్రా తారా రీడ్‌ అనే ఓ ఉద్యోగి తాను బిడైన్‌ సెనేట్‌ ఆఫీసులో పనిచేస్తున్నపుడు ఆయన తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిన్న పిల్లలను దగ్గరకు తీసుకునే బైడెన్‌.. ఓ బాలికను దగ్గరకు తీసుకుంటూ, ‘‘ఈమె ఎంతో అందంగా ఉంది. అబ్బాయిలను తనకు దూరంగా ఉంచండి’’ ఆమె సోదరుడికి చెప్పడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తన వాగ్దాటితో ప్రజలను మెప్పించగల చాతుర్యం ఉన్న బైడెన్‌ కొన్నిసార్లు ట్రంప్‌లాగే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రేడియో షోలో పాల్గొన్న ఆయన.. ‘‘ట్రంప్‌ లేదా నేను ఎవరికి మద్దతునిస్తావో తేల్చుకోలేకపోయినట్లయితే నువ్వు నల్లజాతీయుడివే కాదంటూ’’ హోస్ట్‌ను ఉద్దేశించి కామెంట్‌ చేశారు. ఇక వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సయమయంలో ఒబామాను ఉద్దేశించి అందంగా, శుభ్రంగా కనబడే తొలి ఆఫ్రికన్‌ అంటూ వ్యాఖ్యానించడంతో కొంతమంది విపరీత అర్థాలు తీసి బైడెన్‌పై విమర్శలు గుప్పించారు.
 

మరిన్ని వార్తలు