US presidential election 2024: ట్రంప్‌ కేసు దారెటు!?

7 Apr, 2023 05:32 IST|Sakshi
కోర్టులో న్యాయవాదులతో ట్రంప్‌ (ఫైల్‌)

ఇకనైనా నోరు మూసుకోకపోతే గాగ్‌ ఆర్డర్‌ తప్పదు 

కేసులన్నీ కొట్టివేయించేందుకు ట్రంప్‌ లాయర్ల యత్నాలు 

కోర్టులో తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయం 

తుది తీర్పు వచ్చే నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి 

అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు ట్రంప్‌ ఏర్పాట్లు  

అవినీతి అక్రమాలకు పాల్పడి, న్యాయస్థానంలో నేర విచారణను ఎదుర్కొంటున్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా అపకీర్తిని మూటగట్టుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున తానే బరిలో ఉంటానని సంకేతాలిస్తున్నారు. అసలు అది సాధ్యమేనా అన్న చర్చ ప్రపంచమంతటా సాగుతోంది.

ట్రంప్‌పై నమోదైన హష్‌ మనీ చెల్లింపుల కేసులో ఇకపై ఏం జరగవచ్చన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్‌పై కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి చాలా సమయం పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ముందే కేసులను కొట్టివేయించేందుకు ట్రంప్‌ న్యాయబృందం ప్రయత్నాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చన్నది ఆసక్తికరంగా మారింది...
 
గాగ్‌ ఆర్డర్‌ ఇస్తారా?   
► డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్రమైన అభియోగాలు వచ్చాయని, అవి నిరూపితమైతే ఆయనకు గరిష్ట స్థాయిలో జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  
► న్యాయమూర్తులపై ట్రంప్‌ అవాకులు చెవాకులు పేలుతున్నారు. న్యూయార్క్‌ సుప్రీంకోర్టు జడ్జి జువాన్‌ మెర్చాన్, మన్‌హట్టన్‌ జిల్లా అటార్నీ అల్విన్‌ బ్రాగ్‌పై విరుచుకుపడ్డారు.  
► ట్రంప్‌ మంగళవారం మన్‌హట్టన్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు         హంగామా సృష్టించారు. ఇదంతా న్యాయస్థానానికి చికాకు తెప్పించింది.   
► సమాజంలో హింసను ప్రేరేపించే, అశాంతిని సృష్టించే, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలకు,  ప్ర­వర్తనకు దూరంగా ఉండాలని ట్రంప్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మెర్చాన్‌ హితవు పలికారు.
► ఇది జరిగిన ఐదు గంటల తర్వాత ట్రంప్‌ నోరు పారేసుకున్నారు. జువాన్‌ మెర్చాన్, అల్విన్‌ బ్రాగ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.   
► మెర్చాన్, ఆయన భార్య, ఆయన కుటుంబం తనను ద్వేషిస్తోందని ఆరోపించారు. ఇక అల్విన్‌ బ్రాగ్‌ ఒక విఫలమైన జిల్లా అటార్నీ అని ఆక్షేపించారు. ఆయనపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.  అల్విన్‌ బ్రాగ్‌ ఒక జంతువు, మానసిక రోగి అని ట్రంప్‌ మండిపడ్డారు.  
► ట్రంప్‌ నోటికి తాళం వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జువాన్‌ మెర్చాన్‌ గాగ్‌ ఆర్డర్‌ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.  
► గాగ్‌ ఆర్డర్‌ జారీ చేస్తే కేసుల గురించి ట్రంప్‌ గానీ, ఆయన న్యాయబృందం గానీ ఎక్కడా బహిరంగంగా చర్చించకూడదు.
► గాగ్‌ ఆర్డర్‌ను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణించి కేసు నమోదు చేస్తారు. ట్రంప్‌కు 1,000 డాలర్ల జరిమానా లేదా 30 రోజుల జైలు శిక్ష.. లేదా రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంటుంది.

సాక్ష్యాలు అందాక ఏం చేస్తారో?  
► ట్రంప్‌ హష్‌ మనీ చెల్లించిన కేసులో మన్‌హట్టన్‌ జిల్లా అటార్నీ కార్యాలయం గత ఐదేళ్లుగా విచారణ కొనసాగిస్తోంది.  
► చెల్లింపుల వ్యవహారాన్ని ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అల్విన్‌బ్రాగ్‌ చెబుతున్నారు.  
► దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూటర్లు ట్రంప్‌ న్యాయ బృందానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘డిస్కవరీ’ అంటారు.  
► ఇది 35 రోజుల్లోగా పూర్తికావాలి. కానీ, అల్విన్‌ బ్రాగ్‌ నేతృత్వంలోని ప్రాసిక్యూటర్ల బృందానికి 65 రోజుల సమయం.. అంటే జూన్‌ 8 దాకా గడువు ఇచ్చారు. సాక్ష్యాలు చేతికి అందాక ట్రంప్‌ న్యాయవాదులు ఎలాంటి ఎత్తుగడ వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  

ట్రంప్‌ పోటీ ఖాయమేనా?  
► ట్రంప్‌ లాయర్ల తీర్మానాలపై డిసెంబర్‌ 4న కోర్టు తీర్పు వెలువడనుంది.  
► తీర్మానాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ట్రంప్‌పై అసలైన విచారణ ప్రారంభమవుతుంది.   
► వచ్చే ఏడాది జనవరి నుంచి విచారణ చేపట్టాలని తాము కోర్టును కోరుతామని ప్రాసిక్యూటర్లు చెప్పారు.  
► మార్చి నుంచి జూన్‌ వరకూ అమెరికాలో వసంత కాలం. అప్పుడైతే బాగుంటుందని ట్రంప్‌ లాయర్లు అభిప్రాయపడుతున్నారు.  
► విచారణ మొదలయ్యే నాటికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రైమరీ ఎన్నికల్లో ప్రజలు పార్టీల తరపున పోటీ చేసే నామినీలకు ఓటు వేస్తారు.  
► ట్రంప్‌పై విచారణ పూర్తయ్యి, తుది తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.

కొత్త అధ్యక్షుడు కొలువుతీరుతాడు.  
► 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ నిక్షేపంగా పోటీ చేయొచ్చు. ఏ చట్టమూ ఆయనను అడ్డుకోలేదు.  
► రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేయడానికి ట్రంప్‌ ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.  
► ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేస్తే పదవి నుంచి దిగిపోవడమో లేక కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడడమో చేయాల్సి ఉంటుంది. 
 

తీర్మానం ప్రవేశపెడతారా?  
► ట్రంప్‌ను అన్ని కేసుల నుంచి నిర్దోషిగా బయటకు తీసుకువస్తామని ఆయన తరపు లాయర్లు ఇప్పటికే తేల్చిచెప్పారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.  
► చట్టప్రకారం చూస్తే విచారణ ప్రారంభం కావడానికి ముందు కేసులన్నింటినీ పునఃపరిశీలించి, ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టును అభ్యర్థించే వెసులుబాటు ఉంది. ఈ మేరకు కోర్టులో తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు.  
► కేసులను పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలని ట్రంప్‌ బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే ట్రంప్‌కు విముక్తి లభించినట్లే. అయితే, ఇదంతా ఆయన లాయర్ల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది.  
► ట్రంప్‌ కేసులను విచారిస్తున్న జడ్జిని విధుల నుంచి తొలగించాలని, విచారణ వేదికను మన్‌హట్టన్‌ నుంచి సమీపంలోని స్టాటెన్‌ ఐలాండ్‌కు మార్చాలని కోరుతూ కూడా తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు వీలుంది. మన్‌హట్టన్‌లో ట్రంప్‌ అభిమానులు పెద్దగా లేరు. అక్కడ విచారణ జరపడం సమంజసం కాదని ఆయన వాదిస్తున్నారు.  
► మామూలుగా అయితే 45 రోజుల్లోగా తీర్మానం ప్రవేశపెట్టాలి. ట్రంప్‌ బృందానికి జడ్జి మెర్చాన్‌ ఆగస్టు 8 దాకా గడువు ఇచ్చారు. అంటే నాలుగు నెలలు. ట్రంప్‌ లాయర్ల తీర్మానంపై ప్రాసిక్యూటర్లు స్పందించడానికి సెప్టెంబర్‌ 19వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్దేశించారు.  
► తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలూ కచ్చితంగా వాడుకుంటామని, ప్రతి చిన్న అంశాన్ని కూడా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తున్నామని ట్రంప్‌ న్యాయవాది జోయ్‌ టాకోపినా చెప్పారు.  

 

సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు