రికార్డు స్థాయి ఓటింగ్‌!

5 Nov, 2020 03:43 IST|Sakshi
పోర్ట్‌ల్యాండ్‌లో కౌంటింగ్‌

న్యూయార్క్‌: ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. గత శతాబ్ద కాలంలోనే ఎన్నడూ నమోదు కాని స్థాయిలో, అత్యధికంగా 67% వరకు ఓటింగ్‌ నమోదు కానుంది. ఈ ఎన్నికల్లో సుమారు 16 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు ఎన్నికల డేటాను అధ్యయనం చేసే యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లారిడా ప్రొఫెసర్‌ మైఖేల్‌ మెక్‌ డొనాల్డ్‌ను ఉటంకిస్తూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది. ఇందులో 10 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ విధానంలో ఇప్పటికే ఓటేయడం విశేషం. ఇప్పటివరకు 1908లో మాత్రమే 65% మించి పోలింగ్‌ నమోదైంది. ప్రజా జీవితాలను అనూహ్యంగా అతలాకుతలం చేసిన కరోనా వైరస్, ఆర్థిక అనిశ్చితి తదితర అంశాలపై అమెరికన్లు తమ గళాన్ని వినిపించే ఉద్దేశంతో ఉన్నారని   ఈ అత్యధిక పోలింగ్‌ శాతం సూచిస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. స్వేచ్ఛగా, సురక్షితంగా ఓటేసేందుకు పలు రాష్ట్రాలు తీసుకున్న చర్యల వల్ల కూడా ఓటింగ్‌ శాతం పెరిగినట్లు అభిప్రాయపడింది.

టెక్సస్, కొలరాడో, వాషింగ్టన్, ఒరెగాన్, హవాయి, మొంటానా సహా పలు రాష్ట్రాల్లో ఈ ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్‌ అత్యధిక స్థాయిలో జరిగింది. డెమొక్రటిక్‌ ఓటర్లు ముందస్తు ఓటింగ్‌లో, రిపబ్లికన్‌ ఓటర్లు ఎన్నికల రోజు ఓటింగ్‌లో అత్యధికంగా పాల్గొన్నట్లు పలు మీడియా సంస్థలు అంచనా వేశాయి. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్లలో అత్యధికం డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌కే వచ్చే అవకాశమున్నట్లు పేర్కొన్నాయి. నల్ల జాతీయులు కూడా ఈ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో ఓటేసినట్లు నల్లజాతీయులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు కృషి చేసే ఒక సంస్థ పేర్కొంది. టెక్సస్‌లో 6.16 లక్షల మంది నల్లజాతీయులు ముందస్తు ఓటింగ్‌లో పాల్గొన్నారని వెల్లడించింది. కాగా,  ఎన్నికల రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. విధ్వంసం, ఆందోళనలు, లూటీలు జరుగుతాయన్న భయంతో యజమానులు తమ షాప్స్‌ ముందు ప్లైవుడ్‌ బోర్డులను రక్షణగా పెట్టుకున్న విషయం తెలిసిందే.   

ప్రతినిధుల సభలో తగ్గనున్న డెమొక్రాట్ల సంఖ్య
ప్రతినిధుల సభకు జరిగిన తాజా ఎన్నికల్లో డెమొక్రాట్ల పలు సిటింగ్‌ స్థానాలను రిపబ్లికన్‌ పార్టీ గెలుచుకుంది. అయినా, సభలో డెమొక్రాట్ల ఆధిక్యత కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాజా ఫలితాల్లో బుధవారం రాత్రి వరకు(భారత కాలమానం) డెమొక్రాటిక్‌ పార్టీ 197 స్థానాల్లో, రిపబ్లికన్‌ పార్టీ 185 సీట్లలో గెలుపొందాయి. నార్త్‌ కరోలినాలో రెండు స్థానాలను డెమొక్రాటిక్‌ పార్టీ గెలుచుకుంది. గ్రామీణ మినెసొట నుంచి గత మూడు ఎన్నికల్లో గెలిచిన డెమొక్రటిక్‌ అభ్యర్థి కాలిన్‌ పీటర్సన్‌ను ఎట్టకేలకు రిపబ్లికన్లు ఓడించగలిగారు. అయొవాలో రిపబ్లికన్‌ అభ్యర్థి, టీవీ న్యూస్‌ యాంకర్‌ హిన్‌సన్‌ గెలుపొందారు.

మరిన్ని వార్తలు