ఉక్రెయిన్‌పై దండెత్తితే...భారీ మూల్యం తప్పదు

13 Feb, 2022 04:53 IST|Sakshi

పుతిన్‌కు మరోసారి బైడెన్‌ హెచ్చరిక

గంటకు పైగా అధ్యక్షుల ఫోన్‌ చర్చలు

పోలండ్‌కు మరో 3,000 మంది అమెరికా సైనికులు

బుధవారం ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయొచ్చంటూ వార్తలు

ఉక్రెయిన్‌లోని యూఎస్, ఇంగ్లండ్‌ ఎంబసీ సిబ్బంది వెనక్కు

మాస్కో/వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ సంక్షోభం ముదురు పాకాన పడుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా, రష్యా అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం జరిపిన ఫోన్‌ సంభాషణలు వాడివేడిగా సాగాయి. ఉక్రెయిన్‌పై దాడికి దిగితే రష్యా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పుతిన్‌ను బైడెన్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించారని వైట్‌హౌస్‌ వెల్లడించింది.

కఠినాతి కఠినమైన ఆర్థిక ఆంక్షలు తదితరాలను ఎదుక్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేగాక యుద్ధానికి దిగితే అంతర్జాతీయంగా రష్యా స్థాయి కూడా బాగా దిగజారుతుందని బైడెన్‌ అభిప్రాయపడ్డట్టు చెప్పింది. ఉక్రెయిన్‌పై దాడికి బుధవారాన్నిముహూర్తంగా రష్యా నిర్ణయించుకుందని యూఎస్‌ నిఘా వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరలో మరోసారి పుతిన్‌కు కాల్‌ చేయాలని బైడెన్‌ నిర్ణయించినట్టు వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.

ఏ క్షణంలోనైనా రష్యా దాడి: సలివన్‌
ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడికి దిగవచ్చన్న వార్తల నేపథ్యంలో పోలండ్‌కు మరో 3,000 మంది సైనికులను తరలించనున్నట్టు అమెరికా శనివారం ప్రకటించింది. వీరంతా వారంలోపు ఇప్పటికే పోలండ్‌లో ఉన్న 1,700 మంది సైనికులతో కలుస్తారు. అలాగే జర్మనీలో ఉన్న 1,000 తమ సైనికులను రొమేనియాకు యూఎస్‌ తరలించనుంది. 18వ ఎయిర్‌బోర్న్‌ కారŠప్స్‌కు చెందిన 300 మంది సైనికులు కూడా తాజాగా జర్మనీ చేరుకున్నారు. యూరప్‌లో ఇప్పటికే 80 మంది అమెరికా సైనికులున్నారు.

మరోవైపు యుద్ధ భయాల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా హుటాహుటిన వెనక్కు పిలుచుకుంటోంది. రాజధాని కీవ్‌లోని యూఎస్‌ ఎంబసీ సిబ్బందిని కుటుంబంతో సహా వచ్చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఇంగ్లండ్‌తో సహా పలు యూరప్‌ దేశాలు ఉక్రెయిన్‌లో నుంచి తమ రాయబార సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నాయి. అమెరికా పౌరులు కూడా తక్షణం దేశం వీడాలని అధ్యక్షుని జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ అంతకుముందు సూచించారు. ఉక్రెయిన్‌పై దాడికి పుతిన్‌ ఏ క్షణంలోనైనా ఆదేశాలివ్వవచ్చని ఆయన అన్నారు.  

మరిన్ని వార్తలు