హెచ్‌1బీ నైపుణ్య వృత్తులకు బీ1 వీసాలొద్దు!

23 Oct, 2020 04:16 IST|Sakshi

అమెరికా ప్రతిపాదన

అమల్లోకి వస్తే భారతీయ టెకీలకు, కంపెనీలకు ఇబ్బందే

వాషింగ్టన్‌: భారతీయ టెక్కీలపై ప్రతికూల ప్రభావం చూపే మరో నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకోనుంది. హెచ్‌1బీ నైపుణ్య వృత్తుల వారికి తాత్కాలిక బిజినెస్‌ వీసాలను జారీ చేయకూడదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదించింది. ఈ వీసా కింద కంపెనీలు ఆన్‌సైట్‌ జాబ్‌ విధానంలో పరిమిత కాలానికి టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు సాధించేందుకు పలు ఇతర విధానాలున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. 

విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలపై పడే దుష్ప్రభావాన్ని ఈ ప్రతిపాదన తొలగిస్తుందని, హెచ్‌1బీ వీసా నియమాల అమలులో పారదర్శకత లభిస్తుందని స్పష్టం చేసింది. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. పలు భారతీయ టెక్నాలజీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. గతంలో, భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్‌పై బీ1 వీసాల జారీకి సంబంధించి ఆరోపణలు వచ్చిన విషయాన్ని విదేశాంగ శాఖ ప్రస్తావించింది. సుమారు 500 మంది ఉద్యోగులను వీసా నిబంధనలకు విరుద్ధంగా.. హెచ్‌1బీపై కాకుండా బీ1 వీసాలపై యూఎస్‌లో ఉద్యోగాలు కల్పించిందనే ఆరోపణలపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ ఇన్ఫోసిస్‌కు 8 లక్షల డాలర్ల జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేసింది.

కాగా, తమ ఉద్యోగుల వేతన భారాన్ని భరించలేకపోతున్నామని, ఆ భారం నుంచి తమకు రక్షణ కల్పించాలని అమెరికాకు చెందిన ఒక ఆర్కిటెక్చర్‌ కంపెనీ కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆ కంపెనీ తమ వద్ద ఉన్న అమెరికన్‌ ఆర్కిటెక్ట్‌లను తొలగించి.. ఆ స్థానంలో చవకగా విదేశీ ఆర్కిటెక్చర్‌ సంస్థ నుంచి విదేశీ ఆర్కిటెక్ట్‌ల సేవలను పొందాలని భావిస్తుందేమో. కానీ, ఆ విదేశీ ఉద్యోగులకు కూడా హెచ్‌1బీ నిబంధనల ప్రకారం ఇక్కడి ఆర్కిటెక్ట్‌ సేవలకు ఇచ్చే వేతనాన్నే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, అమెరికన్ల ఉద్యోగాల రక్షణకు కాంగ్రెస్‌ రూపొందించిన ఇతర నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది’ అని వివరించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు