అణు ఒప్పందం మరో అయిదేళ్లు

23 Jan, 2021 03:59 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా, రష్యా మధ్య అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని అగ్రరాజ్యం ప్రతిపాదించింది.  ఈ అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సమయంలోనే పొడిగించడానికి కూడా వీలు కల్పించడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జాతి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ మీడియాకి చెప్పారు. 2010లో బరాక్‌ ఒబామా హయాంలో కుదిరిన ఈ అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగియనుంది. దీని ప్రకారం ఒక్కో దేశం 1,550కి మించి అణు వార్‌హెడ్‌లను మోహరించడానికి వీల్లేదు.  అమెరికా ప్రతిపాదనని రష్యా స్వాగతించింది. తాము కూడా ఒప్పందాన్ని పొడిగించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధికార ప్రతినిధి పెస్కోవ్‌ చెప్పారు.

డైట్‌ కోక్‌ బటన్‌ తీసేశారు
నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ తీసుకున్న ఒక నిర్ణయం నెటిజన్లని విస్మయపరుస్తోంది. దీనిపై జర్నలిస్టు టామ్‌ న్యూటన్‌ డన్‌ చేసిన ఒక ట్వీట్‌ వైరల్‌గా మారింది. డన్‌ 2019లో ట్రంప్‌ ని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లినప్పుడు ఆయన టేబుల్‌పై ఎర్ర రంగు బటన్‌ కనిపించింది. ఆ బటన్‌ నొక్కగానే బట్లర్‌ డైట్‌ కోక్‌ తీసుకొని రావడంతో  ఆయనకి విషయం అర్థం అయింది. కేవలం కోక్‌ తాగడం కోసమే ట్రంప్‌ ఆ సదుపాయంం ఏర్పాటు చేసుకున్నారు. ట్రంప్‌ నిర్ణయాలన్నింటినీ  బైడెన్‌ తిరగతోడుతున్నట్టుగానే ఈ బటన్‌న్నీ తొలగించారు.

కొత్తింట్లో అడుగు పెడదాం అనుకుంటే..
ప్రమాణ స్వీకారానంతరం కొత్త ఇంట్లో అడుగుపెట్టాలనుకున్న జోబైడెన్‌ దంపతులకు కొద్ది క్షణాల పాటు చేదు అనుభవం ఎదురైంది. నార్త్‌ పోర్టికో గుండా లోపలికి ప్రవేశించేందుకు బైడెన్‌ దంపతులు ప్రయత్నించగా తలుపు తెరచుకోలేదు. దీంతో ఆయన వెనక్కు తిరిగి తనతో పాటు వచ్చిన వారివైపు చూశారు. ఆ తర్వాత అందరూ కలసి లోపలికి వెళ్లడం కనిపించింది. అయితే ఆ తలుపులను ఎవరైనా లోపలి నుంచి తెరిచారా లేక బైడెన్‌ దంపతులే తోసుకుంటూ వెళ్లారా అనేది కనిపించలేదు. దీంతో ఇంట్లో అడుగు పెట్టకముందే ప్రొటోకాల్‌ ఉల్లంఘన కనిపించినట్లు అయింది. ఈ వ్యవహారానికి ముందే వైట్‌ హౌజ్‌లో వీటిని చూసుకొనే ఉద్యోగిని తొలగించడంతో ఈ సమస్య ఉత్పన్నమైనట్లు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు