బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు

15 Feb, 2023 11:21 IST|Sakshi

వాషింగ్టన్‌: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానీ మోదీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ రూపొందించిన తర్వాత ఈ తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది.  విపక్షాలు ఇప్పటికే కేంద్రంపై విమర్శలు గుప్పించాయి.

తాజాగా అగ్రరాజ్యం అమెరికా ఈ వ్యవహారంపై స్పందించింది. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్రిక స్వేచ్ఛకు ప్రాధాన్యం ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భావ ప్రకటనా స్వేచ్చ, మతం లేదా విశ్వాసపరమైన స్వేచ్చ మానవహక్కులుగా దోహదపడుతాయన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని కూడా ఇవే బలోపేతం చేశాయని చెప్పారు. ఈ విషయాలను తాము ఎప్పుడు హైలైట్ చేస్తూనే ఉ‍న్నామని వివరించారు. ఈ సార్వత్రిక హక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యాలకు పునాది అని నొక్కి చెప్పారు.

అయితే బీబీసీపై ఐటీ దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి  వ్యతిరేకమా ? అని అడిగిన ప్రశ్నకు నెడ్ ప్రైస్ ఆచితూచి సమాధానమిచ్చారు. ఈ సోదాలపై నిజానిజాల గురించి తమకు తెలుసునని, అయితే దీనిపై తీర్పు చెప్పే స్థితిలో తాను లేనని వ్యాఖ్యానించారు.
చదవండి: ‘లేఆఫ్స్‌’ తాత్కాలికమే.. అమెరికాలో భారీగా ఉద్యోగాలు..!

మరిన్ని వార్తలు