‘రాహుల్‌ గాంధీ’ వ్యవహారంపై స్పందించిన అమెరికా

28 Mar, 2023 08:27 IST|Sakshi

రాహుల్‌ గాంధీపై కోర్టు కేసు, అనర్హతవేటు తదితర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాహుల్‌ గాంధీ కేసును తమ దేశం గమనిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛతో సహా ప్రజాస్వామ్య విలువలకు భాగస్వామ్య నిబద్ధత విషయంలో భారత ప్రభుత్వంతో అమెరికా ఎప్పుడూ నిమగ్నమై ఉంటుందని పేర్కొంది.

రాహుల్‌ గాంధీని అనర్హత వేటు పరిణామంపై  అమెరికా అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌కు సోమవారం(అక్కడి కాలమానం ప్రకారం) మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. చట్టబద్ధమైన పాలన,  న్యాయ స్వాతంత్ర్యం పట్ల గౌరవం ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభం. భారత దేశంలోని కోర్టులలో మిస్టర్‌ గాంధీ (రాహుల్ గాంధీని ఉద్దేశించి) కేసును మేము గమనిస్తూనే ఉన్నాం.. 

భావ స్వేచ్ఛ ప్రకటన సహా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు భారత్‌తో కలిసి మేం ముందుకు నడుస్తాం. ఇరు దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు.. కీలకమైన మానవ హక్కుల పరిరక్షణను(భావ స్వేచ్ఛ ప్రకటనసహా), ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను  ఎప్పటికప్పుడు హైలెట్‌ చేస్తూనే వస్తున్నాం అని తెలిపారాయన. అయితే..

ఈ విషయంలో భారత ప్రభుత్వంతో గానీ, రాహుల్‌ గాంధీతో గానీ అమెరికా ఏమైనా సంప్రదింపులు జరిపిందా? అని ప్రశ్నించగా.. అలాంటిదేం జరగలేదని ఆయన బదులిచ్చారు.  

కాగా, కాగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ‘మోదీ ఇంటి పేరు’(2019లో చేసినవి) వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో దోషిగా తేలిడంతో.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్‌ కోర్టు. ఆపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఆయనపై లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది. బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని ఖండించాయి. ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌.. విపక్షాలన్నింటిని ఏకం చేసుకుని కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది.    

(చదవండి: యూఎస్‌ టేనస్సీ: స్కూల్‌లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి)
 

మరిన్ని వార్తలు