93 మందిని పొట్టనబెట్టుకున్న సీరియల్‌ కిల్లర్‌ మృతి!

31 Dec, 2020 10:37 IST|Sakshi
సామ్యూల్‌ లిటిల్‌(ఫొటో క్రెడిట్‌: ఎఫ్‌బీఐ.జీవోవీ సైట్‌)

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్‌ సీరియల్‌ కిల్లర్‌గా పేరొందిన సామ్యూల్‌ లిటిల్‌ మృతి చెందాడు. 19 రాష్ట్రాల్లో సుమారు 93 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న అతడు బుధవారం మరణించాడు. ఈ మేరకు కాలిఫోర్నియా కరెక్షన్స్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ డిపార్టుమెంట్‌ ప్రకటన విడుదల చేసింది. కాగా 80 ఏళ్ల వయస్సు గల సామ్యూల్‌ వయోభారంతో చనిపోయినట్లు సమాచారం. కాగా దక్షిణ అట్లాంటాకు సమీపంలో గల రెనాల్డ్స్‌(జార్జియా)లో 1940, జూన్‌ 7న సామ్యూల్‌ లిటిల్‌ జన్మించాడు. టీనేజర్‌ అయిన అతడి తల్లి పసివాడుగా ఉన్నపుడే తనను బంధువుల ఇళ్లలో వదిలివెళ్లడంతో సామ్యూల్‌ బాల్యం భారంగా గడిచింది. ఒంటరితనం వెంటాడింది.

ఈ క్రమంలో ఐదో తరగతిలో ఉన్నపుడు ఓ టీచర్‌ తన మెడను రుద్దుకున్నపుడు గమనించిన అతడికి అప్పటి నుంచి ఎవరి మెడను చూసినా గట్టిగా నొక్కిపట్టాలని, గొంతు నులమాలనే కోరిక పుట్టింది. ఆ సమయంలో తన పక్కనే ఉన్న సహ విద్యార్థినిని చంపడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలమైనట్లు ఇటీవల సామ్యూల్‌ వెల్లడించాడు. అలా చిన్ననాటి నుంచే నేర ప్రవృత్తికి అలవాటు పడిన సామ్యూల్‌... పదమూడేళ్ల వయస్సులో దొంగతనం చేసి పోలీసుల చేతికి చిక్కాడు.(చదవండి: ఒళ్లు గగుర్పొడిచే విషయాలు చెప్పిన సీరియల్‌ కిల్లర్‌

ఆ తర్వాత సీరియల్‌ కిల్లర్‌గా మారి పదుల సంఖ్యలో హత్యలు చేశాడు. అలా సుమారు 93 మంది మహిళలను పొట్టనబెట్టుకున్నాడు. మృతుల ఒంటిపై ఉన్న బంగారం వంటి విలువైన వస్తువులు లాక్కోవడం, శవాలను పొదల్లో పడేసి అక్కడి నుంచి జారుకునేవాడు. పోలీసులకు ఎలాంటి ఆనవాలు దొరకకుండా జాగ్రత్త పడేవాడు. కాగా హత్యలతో పాటు చిన్నా చితక దొంగతనాలు, దోపిడీలు చేసే సామ్యూల్‌ అప్పుడప్పుడూ అరెస్టైనా వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేవాడు. కానీ పోలీసులు మాత్రం అతడిపై నిఘా వేసే ఉంచారు.

అలా ఒకానొక హత్య కేసులో లభించిన ప్రాథమిక ఆధారాలతో 2014లో అతడిని అరెస్టు చేశారు. డీఎన్‌ఏ టెక్నాలజీని ఉపయోగించి నేరాన్ని రుజువు చేయడంతో స్థానిక కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష(లు) విధించింది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోని జైలులో సామ్యూల్‌ శిక్ష అనుభవిస్తున్న సామ్యూల్‌ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఛేదించలేక సామ్యూల్‌తో ఆ నేరాలు చేసినట్లు పోలీసులు ఒప్పించారనే విమర్శలు వినిపించాయి. అయితే సామ్యూల్‌ మాత్రం తాను యువకుడిగా ఉన్న సమయంలో ఎలా హత్యలు చేశానన్న అంశం గురించి పూసగుచ్చినట్లు వివరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. (చదవండి: రహస్య గది.. 9 హత్యలు)

మరిన్ని వార్తలు