సిగ్గు లేని చైనా.. వింటర్‌ ఒలింపిక్స్‌ వేదికగా సరిహద్దు అంశాన్ని కెలికి మరీ..

3 Feb, 2022 11:43 IST|Sakshi

ఒకవైపు కరోనా కేసులు దాచి పెడుతూ.. ఎలాగైనా వింటర్‌ ఒలింపిక్స్‌ వేడుకల్ని నిర్వహించాలని చైనా తాపత్రయపడుతోంది. ఈ క్రమంలో సరిహద్దు అంశాన్ని కెలికి మరీ విమర్శలు ఎదుర్కొంటోంది. చైనా తాజాగా చేసిన పనిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. 

బుధవారం వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను‌ నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్‌బేరర్‌గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. ఇతను గల్వాన్‌ లోయ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన సీపీఏల్ఏ కమాండర్‌.  ఈ విషయాన్ని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షిన్‌జియాంగ్‌ మిలటరీ కమాండర్, గల్వాన్‌ లోయ వీరుడు క్వీ ఫబోవో.. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు వాంగ్ మింగ్‌తో కలిసి ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని రిలేను ప్రారంభించారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

కాగా, ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ‘‘ఇది సిగ్గుమాలిన పని.  గల్వాన్‌ లోయ దాడిలో పాల్గొన్న వ్యక్తిని.. అదీ ఉయిగర్ల ఊచకోతకు కారణమైన వ్యక్తి టార్చ్‌ బేరర్‌గా ఎంచుకోవడం వెనుక ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపింది. భారత సార్వభౌమత్వానికి, ఉయిగర్ల స్వేచ్ఛకు అమెరికా ఎప్పుడూ మద్ధతు ఇస్తూనే ఉంటుంది’’ అని యూఎస్‌ సెనేట్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ కమిటీ ర్యాంకింగ్‌ మెంబర్‌ ఈ ఉదయం ఒక ట్వీట్‌ చేశారు.    ఇక, శీతాకాల ఒలింపిక్స్‌ను భారత్ బహిష్కరించనప్పటికీ.. ప్రారంభ వేడుకలు సహా ఒలింపిక్ కార్యక్రమానికి మన దేశం నుంచి ఎవ్వర్నీ పంపడంలేదు.


నష్టం ఎక్కువే!
భారత్‌ సైన్యంతో గల్వాన్‌ లోయలో 2020 జూన్ 15న జరిగిన ఘర్షణల్లో 40 మందికిపైగా సీపీఎల్ఏ జవాన్లు చనిపోయినా.. పరువు పోతుందనే భయంతో నలుగురు మాత్రమే మరణించారని డ్రాగన్ తక్కువచేసి చెప్పింది.  నలుగురు సైనికులకు మరణానంతరం గత సంవత్సరం గౌరవ బిరుదులు, ఫస్ట్-క్లాస్ మెరిట్ పతకాలను అందజేసింది. గతంలో రష్యా ఏజెన్సీలు చైనా నష్టంపై ఒక ప్రకటన చేయగా.. తాజాగా ఆస్ట్రేలియా పేపర్‌ ఒకటి ఏడాది విచారణ తర్వాత ఆ మరణాల సంఖ్య ఎక్కువేనని ప్రకటించింది. చీకట్లో శీతల వరద ప్రవాహాంలో పడి చాలామంది సైనికులు కొట్టుకు పోయి ఉంటారని, కానీ, చైనా ఆ విషయాన్ని దాస్తోందని ఆ వార్తా పత్రిక.. ఈ మేరకు చైనా నుంచే పలు ఆధారాలను సేకరించినట్లు మరీ వెల్లడించింది. ఇక గల్వాన్ ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారైన సంగతి తెలిసిందే.

చదవండి: షిన్‌జియాంగ్‌ కాదు మొత్తం చైనాకే ముడిపెట్టిన బైడెన్‌

మరిన్ని వార్తలు