యుద్ధ మరణం: చనిపోయిన 73 ఏళ్లకు.. సైనికుడికి అంత్యక్రియలు..

30 May, 2023 14:02 IST|Sakshi

విధి లిఖితమో దురదృష్టమో గానీ కొందరు చనిపోతే తదనంతరం చేయాల్సి కార్యక్రమాలకు రకరకాల అడ్డంకులు ఎదురవుతాయి. యుద్ధంలో లేక మిస్సింగ్‌ కేసులో చనిపోతే ఆ వ్యక్తి ఆఖరి చూపు కోసం కుటుంబసభ్యుల నిరీక్షణ అంతా ఇంత కాదు. ఈలోగ అతడి బంధవులంతా చనిపోయినా.. లేక ఆ వ్యక్తి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకుంటున్న విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

అచ్చం అలానే ఇక్కడొక సైనికుడు యుద్ధంలో వీరమరణం పొందాడు. కానీ అతడి మృతదేహం లేదా అవశేషాలు గానీ  లేక అంతిమ సంస్కరాలు నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది అతడి కుటుంబం. ఐదో, పదో ఏళ్లు కాదు ఏకంగా 73 ఏళ్లు ఆ సైనికుడి అవశేషాల కోసం ఎదురు చూసింది ఆ కుటుంబం. వివరాల్లోకెళ్తే..యూఎస్‌ సైనికుడు సీపీఎల్‌ లూథర్‌ హెర్షెల్‌ స్టోరీ 18 ఏళ్ల వయసులో 1950 సెప్టంబర్‌ 1న జరిగిన కొరియన్‌ యుద్ధంలో మరణించాడు. ఐతే అదే యుద్ధంలో మరికొంతమంది సైనికులు చనిపోవడంతో సదరు సైనికుడు హెర్షెల్‌ అవశేషాలు అంత తేలికగా దొరకలేదు. దీని కోసం దర్యాప్తు సంస్థ పలు విధాలుగా విచారించింది కూడా.

ఐతే ఆ యద్ధ సమయంలో మరణించిన సైనికులు అవశేషాలతో అతడి కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో మ్యాచ్‌ కాలేదు. దీంతో ఆ కుటుంబం అతడి అంతిమ సంస్కరాలు చేయడం కోసం చాలా ఏళ్ల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎ‍ట్టకేలకు అతడి అవశేషాలు దొరకడమే గాక అతడి కుటుంబ సభ్యలు డీఎన్‌ఏతో సరిపోయింది. దీంతో అతడు చనిపోయిన 73 ఏళ్లకు జార్జియాలోని స్వస్థలంలో సైనిక లాంఛనాలతో ఖననం చేశారు.

కొరియన్‌ యుద్ధ సమయంలో పరాక్రమంతో శత్రువులను మట్టికరిపించినందుకు ఆ సైనికుడు అత్యంత గుర్తింపు పొందాడు. యూఎస్‌ ఆర్మీ అతని మరణాంతరం సైనిక అ‍త్యున్నత పురస్కారాన్ని ప్రకటించడమే గాక ఆ మెడల్‌ని అతడి తండ్రికి ప్రధానం చేసింది. ఆతడు అసాధారణ పోరాట పటిమకు నిలవెత్తు నిదర్శనం అని ప్రశంసించింది. అకుంఠిత దీక్ష, ధైర్యసాహసాలకు ఈ అత్యున్నత మెడల్‌ సత్కారమని యూస్‌ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు అతడి చిత్ర పటంతోపాటు ఆ అత్యున్నత మెడల్‌ని నేషనల్ మెడల్ ఆఫ్ ఆనర్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచింది. 
(చదవండి: ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..)

మరిన్ని వార్తలు