కృష్ణబిలం ‘వినిపిస్తోంది’.. ఆడియో క్లిప్‌ విడుదల చేసిన నాసా

24 Aug, 2022 07:35 IST|Sakshi

కృష్ణబిలం.. ఆయువు తీరిన తార తనలోకి తాను కుంచించుకుపోయే క్రమంలో ఏర్పడే అనంత గురుత్వాకర్షణ శక్తి కేంద్రం. సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కాంతితో సహా సర్వాన్నీ శాశ్వతంగా తనలోకి లాక్కుంటుంది. దాని గుండా కాంతి కూడా ప్రసరించలేదు గనక కృష్ణబిలం (బ్లాక్‌హోల్‌) ఎలా ఉంటుందో మనం చూసే అవకాశం లేదు. అలాంటి కృష్ణబిలం నాసా శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తొలిసారి ‘వినిపించింది’. ఇందుకోసం 2003లో సేకరించిన ఒక కృష్ణబిలం తాలూకు డేటాకు శాస్త్రీయ పద్ధతిలో నాసా శబ్ద రూపమిచ్చింది. దాని కేంద్రం నుంచి అన్నివైపులకూ ఊహాతీతమైన వేగంతో నిత్యం వెలువడే అతి తీవ్రమైన ఒత్తిడి తరంగాలను శబ్ద రూపంలోకి మార్చి విడుదల చేసింది.

శబ్దం శూన్యంలో ప్రయాణించదన్నది తెలిసిందే. అంతరిక్షం చాలావరకూ శూన్యమయం. కానీ పాలపుంతల సమూహాల్లో అపారమైన వాయువులుంటాయి. వాటిగుండా ప్రయాణించే కృష్ణబిలపు ఒత్తిడి తరంగాలకు నాసా తాలూకు చంద్ర అబ్జర్వేటరీ స్వర రూపమిచ్చింది. ఈ శబ్దం అచ్చం హారర్‌ సినిమాల్లో నేపథ్య సంగీతం మాదిరిగా ‘హూం’.. అంటూ వినిపిస్తోంది. నాసా విడుదల చేసిన వీడియోలో దీన్ని స్పష్టంగా వినవచ్చు. సైన్స్‌ను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతోనే ఈ శబ్ద సృష్టి చేసినట్టు నాసా తెలిపింది.

ఇదీ చదవండి: మిస్టరీ గెలాక్సీ చిక్కింది

మరిన్ని వార్తలు