ఫిఫా క్వార్టర్స్‌లో విషాదం: మ్యాచ్‌ కవర్‌ చేస్తూ కుప్పకూలాడు.. ఖతార్‌ ప్రభుత్వంపై అనుమానాలు!

10 Dec, 2022 13:17 IST|Sakshi

దోహా: అమెరికన్‌ జర్నలిస్ట్‌ గ్రాంట్ వాల్(48).. గుర్తున్నారా?.. ఫుట్‌బాల్‌ స్టేడియం వద్ద రెయిన్‌ బో కలర్‌ దుస్తులు ధరించి.. ఖతార్‌ పోలీసుల ఆగ్రహానికి గురైన వ్యక్తి. ఎల్జీబీటీక్యూ హక్కులకు మద్ధతుగా ఆయన ఈ పని చేశాడు. అయితే.. ఆయన శుక్రవారం మ్యాచ్‌ సమయంలో హఠాత్తుగా కుప్పకూలి మరణించారు.

శుక్రవారం లుసాయిల్‌ స్టేడియంలో అర్జెంటీనా-నెదర్లాండ్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను కవర్‌ చేస్తూ ఆయన హఠాత్తుగా కుప్పకూలాడు. పక్కనే ఉన్న జర్నలిస్టులు ఆయన్ని సీపీఆర్‌ కాపాడే యత్నం చేశారు. కానీ, అది ఫలించలేదు. అయితే.. ఆయన మరణం పట్ల సోదరుడిగా చెప్పుకుంటున్న ఎరిక్‌ వాల్‌ అనే వ్యక్తి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. గ్రాంట్‌ మరణంలో.. ఖతార్‌ ప్రభుత్వ ప్రమేయం ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేశాడాయన. 

నా పేరు ఎరిక్‌ వాల్‌. వాషింగ్టన్‌ సియాటెల్‌లో జీవిస్తున్నా. గ్రాంట్‌ వాహ్ల్‌ సోదరుడిని నేను. నా కారణంగానే నా సోదరుడు రెయిన్‌బో రంగు షర్ట్‌తో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఆయన చాలా ఆరోగ్యవంతుడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. చావు బెదిరింపులు వచ్చాయని ఆయన నాతో చెప్పాడు. చాలా ఆరోగ్యంగ ఉన్న ఆయన మరణించాడంటే నమ్మబుద్ధ ఇకావడం లేదు. ఆయన్ని చంపేసి ఉంటారు. సాయం కోసం అర్థిస్తున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన సోదరుడు ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ ఎందుకనో ఆ వీడియోపై ఆంక్షలు విధించింది.

ఇదిలా ఉంటే.. ఫిఫా వరల్డ్‌ కప్‌ ఆరంభంలో గ్రాంట్‌ వాల్‌ను సెక్యూరిటీ సిబ్బంది అల్‌ రయాన్‌లోని అహ్మద్‌ బిన్‌ అలీ స్టేడియం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు కూడా. సుమారు 25 నిమిషాల తర్వాత తానెవరో తెలుసుకుని.. ఆపై వాళ్లు తనకు క్షమాపణలు చెప్పి.. లోనికి అనుమతించారని తెలియజేశారు. 

ఇదిలా ఉంటే.. వాల్‌ భార్య గౌండర్‌ మాత్రం ఆయన హఠాన్మరణంపై అనుమానాలు వ్యక్తం చేయలేదు. కేవలం తన భర్త మరణంపై దిగ్భ్రాంతికి గురయ్యానంటూ ఆమె ట్విటర్‌ ద్వారా ఓ పోస్ట్‌ చేశారు. 

వాల్‌.. ప్రిన్స్‌టన్‌ నుంచి 1996లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అప్పటి నుంచి 2021 దాకా స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌గా రాణించారు. సాకర్‌, బాస్కెట్‌ బాల్‌ కవరేజీలకు ఆయన ప్రత్యేక గుర్తింపు దక్కింది. 2012 నుంచి ఏడేళ్ల పాటు ఆయన ఫాక్స్‌ స్పోర్ట్స్‌లో పనిచ చేశారు. ఆపై ఆయన తన సొంత వెబ్‌సైట్‌ను లాంఛ్‌ చేశారు.

మరిన్ని వార్తలు