ఆస్ట్రేలియాకు అమెరికా సబ్‌మెరైన్లు 

15 Mar, 2023 03:38 IST|Sakshi

వాషింగ్టన్‌: ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల ‘ఆకస్‌’ కూటమి మరో అడుగు ముందుకేసింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంత స్వేచ్ఛా, సంరక్షణ కోసం అణు జలాంతర్గాముల ప్రాజెక్ట్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఈ మూడు దేశాలు ప్రకటించాయి. ఇందుకు సోమవారం అమెరికాలోని శాన్‌ డీగోలో జరిగిన ఒక కార్యక్రమం వేదికైంది. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ పాల్గొన్నారు.

ఆకస్‌ ఒప్పందంలో అంతర్భాగమైన అణు జలాంతర్గామి ప్రాజెక్టులో భాగంగా ఆ్రస్టేలియాకు అమెరికా 2030దశకం తొలినాళ్లలో దశలవారీగా మూడు అణుఇంథనంతో పనిచేసే జలాంతర్గాములను అందించనుంది. ‘వచ్చే ఐదేళ్లలో అమెరికా జలాంతర్గాముల నిర్మాణ సామర్థ్యం పెంపు, వర్జీనియా శ్రేణి సబ్‌మెరైన్ల నిర్వహణ కోసం మొత్తంగా 460 కోట్ల డాలర్లు వినియోగిస్తాం. ‘వర్జీనియా’ జలాంతర్గాములతో దశాబ్దకాలం ముందుగానే ఆస్ట్రేలియా జలాంతర సామర్థ్యం ద్విగుణీకృతం అవుతోంది’ అని సునాక్, అల్బనీస్‌ల సమక్షంలో బైడెన్‌ ప్రకటించారు.

బ్రిటన్‌ జలాంతర్గామి టెక్నాలజీ, అమెరికా సాంకేతికతల మేలిమి కలయికగా అణుఇంధనంతో నడిచే సంప్రదాయక ఆయుధాలు అమర్చిన జలాంతర్గామి తయారుకాబోతోంది’ అని బైడెన్‌ చెప్పారు. మూడు దేశాల మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైందని ఈ సందర్భంగా అల్బనీస్‌ వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య పసిఫిక్‌ సముద్రం, దక్షిణ చైనా సముద్రాలు ఉన్న ఇండో–పసిఫిక్‌ ప్రాంతం భౌగోళికంగా, అంతర్జాతీయ జలరవాణాకు కీలకమైన ప్రాంతం. దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కులు తనకే చెందుతాయని చైనా వాదిస్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెల్సిందే.

మరిన్ని వార్తలు