అమెరికా సుప్రీం జడ్జి రూత్‌ అస్తమయం

20 Sep, 2020 03:47 IST|Sakshi
1953లో రూత్‌; రూత్‌కు నివాళులర్పించేందుకు వాషింగ్టన్‌లో సుప్రీంకోర్టుకు వచ్చిన అభిమానులు

సమన్యాయం, మహిళా హక్కుల కోసం చివరికంటూ పోరాటం

అమెరికా ఎన్నికల అంశంగా మారనున్న రూత్‌ మరణం

వాషింగ్టన్‌: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌(87) శుక్రవారం కన్ను మూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ఆమె పాన్‌క్రియాటిక్‌ కేన్సర్‌తో గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. 1993లో అప్పటి అధ్యక్షుడు, డెమొక్రాటిక్‌ నాయకుడు బిల్‌ క్లింటన్‌ ఆమెను సుప్రీం జడ్జిగా నియమించారు. అప్పట్నుంచి 27 ఏళ్ల పాటు ఆమె సమ న్యాయం కోసమే పాటుపడ్డారు.

రూత్‌ మృతితో ఆమె అభిమానుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు దగ్గరకి వేలాదిగా జనం తరలి వచ్చి కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ ఆమెకి అశ్రు నివాళులర్పించారు. ‘‘న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తిని అమెరికా జాతి కోల్పోయింది. ఒక అద్భుతమైన సహచరురాలిని కోర్టు కోల్పోయింది’అని అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్‌ రాబర్ట్స్‌ అన్నారు. మిన్నెసోటాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రూత్‌ని ఒక అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థకి టైటాన్‌లాంటి గొప్ప వ్యక్తికి అమెరికా జాతి యావత్తూ నివాళులర్పిస్తోం దన్నారు.

కొత్త రాజకీయ పోరాటం
అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా ఆరువారాల గడువు ఉన్న సమయంలో రూత్‌ గిన్స్‌బర్గ్‌ మృతి రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కొత్త పోరాటానికి తెరతీసింది. రూత్‌ మరణించడానికి కొద్ది రోజులు ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక తన స్థానాన్ని భర్తీ చేయాలని, అదే తనకున్న ప్రగాఢమైన కోరికంటూ వెల్లడించారు. ఆమె చివరి కోరిక తీర్చాలంటూ డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ డిమాండ్‌ చేశారు. ‘‘ఓటర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అధ్యక్షుడు కొత్త న్యాయమూర్తిని ఎన్నుకోవాలి’’అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే సర్వాధికారాలను అప్పగించింది.

ఒకసారి న్యాయమూర్తి నియామకం జరిగితే వారు జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. రిపబ్లికన్‌ పార్టీ సంప్రదాయ భావజాలానికి మద్దతుగా నిలిచే న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉంటే దేశంలో వివిధ ఫెడరల్‌ కోర్టుల్లోనూ, ఎన్నో సామాజిక అంశాల్లో పట్టు బిగించే అవకాశం ఉంటుందని ట్రంప్‌ భావిస్తున్నారు. అబార్షన్లు, గే మ్యారేజెస్‌ వంటి అంశాల్లో తమకి అనుకూలంగా వ్యవహించే వారినే రూత్‌ స్థానంలో భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీం న్యాయమూర్తిగా అధ్యక్షుడు నామినేట్‌ చేస్తే సెనేట్‌లో అది ఆమోదం పొందాల్సి ఉంటుంది. సెనేట్‌లో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉండడంతో న్యాయమూర్తి నియామకానికి అక్కడ ఎలాంటి ఆటంకం ఉండదు.

రూత్‌ స్థానంలో మరొక జడ్జీని ఎటువంటి జాప్యం లేకుండా నామినేట్‌ చేస్తామని ట్రంప్‌ తెలిపారు. కీలకమైన ఈ పోస్టును నవంబర్‌ 3 అధ్యక్ష ఎన్నికలకు ముందే భర్తీ చేస్తామని తెలిపారు. అయితే, డెమొక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బైడెన్‌ ఈ ప్రకటనను వ్యతిరేకించారు. ‘అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటారు. అధ్యక్షుడు సుప్రీం జడ్జీని నామినేట్‌ చేస్తారు. నవంబర్‌ 3 తర్వాతే జడ్జీ ఎన్నిక ఉంటుంది’ అని స్పష్టం చేశారు.

హక్కుల గళం
అమెరికాలో స్వేచ్ఛాయుత భావజాలానికి ఆమె కథానాయిక. లింగ సమానత్వం, మహిళా హక్కులపై ఎలుగెత్తిన కార్యకర్త. పురుషాధిక్యం కలిగిన న్యాయవాద వృత్తిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. లాయర్‌గా ఉన్న సమయంలోనే లింగ వివక్ష కేసుల్ని ఎక్కువగా తీసుకొని అద్భుతమైన తన వాదనా పటిమతో మహిళలకు అండగా నిలిచారు. న్యాయమూర్తిగా అబార్షన్‌ హక్కులకు మద్దతుగా నిలిచారు. గే హక్కుల పరిధి విస్తృతి, ఒబామాహెల్త్‌కేర్‌ చట్ట పరిరక్షణ, మైనార్టీల హక్కులకు అండగా నిలిచారు. మీటూ ఉద్యమానికి మద్దతునిచ్చారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో యూదు వలసదారులకు చెందిన సాధారణ కుటుంబంలో 1933 , మార్చి 15న జన్మించారు.

రూత్‌ తండ్రి నాథాన్‌ బాడర్‌ రిబ్బన్లు, జిప్పులు వంటివి అమ్ముకునే చిరు వ్యాపారి. తల్లి సెలియా గృహిణి. యూనివర్సిటీలో చదువుతుండగానే సహచర విద్యార్థి మార్టిన్‌ గిన్స్‌బర్గ్‌తో ప్రేమలో పడ్డారు. హార్వార్డ్‌ యూనివర్సిటీలో ఇద్దరూ లా చదివారు. 1954లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. లాయర్‌ చదువు పూర్తి చేసుకున్నాక ఉద్యోగం సంపాదించడంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తను ఒక మహిళని, వలసదారుని కనుకే ఏ అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత ఒక అడ్వకేట్‌గా, న్యాయమూర్తిగా అపూర్వ విజయాలు సాధించి అమెరికన్ల హృదయాల్లో శాశ్వత స్థానం ఏర్పాటు చేసుకున్నారు.


1993లో సుప్రీంకోర్టు జడ్జిగా అధ్యక్షుడు క్లింటన్‌ సమక్షంలో రూత్‌ ప్రమాణం
 

>
మరిన్ని వార్తలు