Polio case in US: అమెరికాలో పోలియో కలకలం.. పదేళ్ల తర్వాత తొలి కేసు

22 Jul, 2022 09:49 IST|Sakshi

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో దాదాపు దశాబ్దం తర్వాత పోలియో కలకలం సృష్టించింది. పదేళ్ల తర్వాత తొలి కేసు నమోదైనట్లు అమెరికా గురువారం ప్రకటించింది. రాక్‌లాండ్‌ కౌంటీకి చెందిన ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్‌గా తేలినట్లు న్యూయార్క్‌ ఆరోగ్య విభాగం వెల్లడించింది. వ్యాధుల నియంత్రణ నిర్మూల కేంద్రం వివరాల ప్రకారం.. అమెరికాలో చివరి సారిగా 2013లో పోలియో కేసు నమోదైంది. నోటి ద్వారా పోలియే వ్యాక్సిన్‌(ఓపీవీ) తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్‌ సోకినట్లు నిపుణులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలోనే నోటి ద్వారా వేసే వ్యాక్సిన్‌కు స్వస్తి పలికింది అమెరికా. 

‘ అమెరికా వెలుపల ఓపీవీ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్‌  వచ్చినట్లు స్పష్టమవుతోంది. అధునాత వ్యాక్సిన్ల ద్వారా కొత్త రకాలు ఉద్భవించవు.’ అని పేర్కొంది న్యూయార్క్ ఆరోగ్య విభాగం. వైరస్‌ వ్యాప్తిని గుర్తించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించింది. పోలియో టీకా తీసుకోని ప్రజలు వెంటనే వేసుకోవాలని హెచ్చరించింది. తొలి కేసు నమోదైన నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కొన్ని దశాబ్దాలుగా అంతర్జాతీయంగా చేస్తున్న కృషి వల్ల పోలియో అంతరించే స్థాయికి చేరుకుంది. ఈ వైరస్‌ ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలపైనే అధిక ప్రభావం చూపుతుంది. 1988 నుంచి కొత్త కేసులు 99 శాతం తగ్గాయి. అప్పటి నుంచి 125 దేశాలను పోలియో రహిత దేశంగా ప్రకటించారు. మొత్తం 3,50,000 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మాత్రం 1960లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలోనే కేసులు తగ్గుముఖం పట్టాయి. నేరుగా పోలియో సోకిన కేసు 1979లో నమోదైంది.

ఇదీ చదవండి: New Polio Virus In London: పోలియో వైరస్‌ కొత్త టైప్‌ గుర్తింపు. ఏ రూపంలో అయినా ముప్పే!

మరిన్ని వార్తలు