హువావేకు మరో దెబ్బ

18 Aug, 2020 08:12 IST|Sakshi

 21 దేశాల్లో 38 అనుబంధ సంస్థలపై ఆంక్షలు 

వాషింగ్టన్‌: చైనా టెలీకమ్యూనికేషన్స్ దిగ్గజం హువావేకు అమెరికాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ దేశ కార్యకలాపాలపై నిఘా పెడుతోందంటూ చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్‌ సంస్థపై ఇప్పటికే పలు ఆంక్షలను విధించిన  డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హువావేకి అనుబంధంగా 21 దేశాల్లో పనిచేస్తున్న మరో 38 సంస్థలపై ఆంక్షలను విధించింది. అమెరికన్ చట్టాన్ని అధిగమించకుండా నిరోధించేందుకు వీటిని బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. అమెరికా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ లేదా టెక్నాలజీతో అభివృద్ధి చేసిన లేదా ఉత్పత్తి చేసిన, విదేశీ సంస్థల చిప్‌లతో సహా ప్రత్యేక లైసెన్స్ లేకుండా సెమీకండక్టర్లను పొందకుండా నిరోధించే లక్ష్యంతో ఈ ఆంక్షలు విధించింది. ఈ చర్యలు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫారెన్‌-ప్రొడ్యూస్‌డ్‌ డైరెక్ట్‌ ప్రొడక్ట్‌ (ఎఫ్‌డిపి) నిబంధనలను సవరించింది. దీంతో మొత్తం సంస్థల సంఖ్య 152 కి చేరింది.   (అలీబాబాకు ట్రంప్ సెగ)

చైనా కమ్యూనిస్ట్ పార్టీ తన విధాన లక్ష్యాలను నెరవేర్చడానికి అమెరికా సాఫ్ట్‌వేర్ , టెక్నాలజీ నుండి అభివృద్ధి లేదా ఉత్పత్తి చేసిన అధునాతన సెమీకండక్టర్లను పొందటానికి హువావే, దాని విదేశీ అనుబంధ సంస్థలు తమ ప్రయత్నాలను విస్తరించాయని వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ ఆరోపించారు జాతీయ భద్రతను , విదేశాంగ విధాన ప్రయోజనాలను బలహీనం చేసేలా  థర్డ్  పార్టీల ద్వారా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభావిత కంపెనీలు, వ్యక్తులకు ప్రధానంగా హువావే కస్టమర్లకు పరికరాలు, సాఫ్ట్‌వేర్, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులను గుర్తించి మార్చుకోవడానికి, వారి కార్యకలాపాలను విండ్-డౌన్ చేయడానికి తాము తగినంత సమయాన్ని ఇచ్చామని , ఇపుడు ఆ సమయం ముగిసిందని విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో ఒక ప్రత్యేక ప్రకటనలో వెల్లడించారు. 

కాగా 2019లో హువావేపై భారీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల హువావే టెక్నాలజీస్, జెడ్‌టీఈ కార్పోరేషన్లను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్ సీసీ) యూనివర్సల్ సర్వీస్ ఫండ్‌ నుంచి నిషేధించింది. చైనా మిలటరీ, ఇంటలిజెన్స్ విభాగాలతో ఈ రెండు కంపెనీలకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆంక్షల నుండి తప్పించుకోవడానికి ఇరాన్‌కు సహాయం, ఇతర ఆరోపణలతో  హువావేపై న్యాయ శాఖ అభియోగాలు మోపింది.

మరిన్ని వార్తలు