ట్రంప్‌ మద్దతుదారుల వీరంగం.. కాల్పులు

7 Jan, 2021 08:00 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌ భవనం(పార్లమెంటు)లోకి దూసుకువచ్చారు. బ్యారికేడ్లను దాటుకుని వెళ్లి పోలీసులతో ఘర్షణకు దిగారు. నూతన ప్రెసిడెంట్‌గా డెమొక్రాట్‌ జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకున్నారు. క్యాపిటల్‌ భవనంలోని కిటికీలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి కార్యాలయంలోకి దూసుకువెళ్లి వీరంగం సృష్టించారు.‌ ఈ ఆందోళనల సందర్భంగా చెలరేగిన కాల్పుల కలకలంలో ఓ మహిళ మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ క్రమంలో ఆందోళనకారులు సంయమనం పాటించాలంటూ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా వీడియో సందేశం విడుదల చేశారు. ఫేస్‌బుక్‌ ఈ వీడియోను తొలగించగా.. ట్రంప్‌ తమ నియమాలకు విరుద్ధంగా పోస్టులు చేశారంటూ ట్విటర్‌ ఆయన అకౌంట్‌ నుంచి రెండు ట్వీట్లు డిలీట్‌ చేసింది. (చదవండి: క్యాపిటల్‌ బిల్డింగ్‌ కూల్చేస్తాం!)

ఈ ఘటనపై అమెరికా చట్టసభ ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సెనేటర్‌ మిచ్‌ మెకానెల్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటివేనని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా నవంబరు 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నికల్లోనూ 306- 232 తేడాతో ట్రంప్‌నకు అందనంత దూరంలో నిలిచి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. అయితే ఆది నుంచి తన ఓటమిని అంగీకరించని ట్రంప్‌.. ఫలితాన్ని తారుమారు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.(చదవండి: అధికార దాహం; ట్రంప్‌ ఆడియో కాల్‌ లీక్‌..!)

ఈ క్రమంలో.. స్వింగ్‌ స్టేట్‌ అయిన జార్జియా ఎన్నికల చీఫ్‌నకు ఆయన చేసిన ఫోన్‌ కాల్‌ ఆడియో లీకైన విషయం తెలిసిందే. ఇక బుధవారం మరోసారి.. ‘‘మనం దీనిని వదిలే ప్రసక్తే లేదు’’ అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. దీంతో ఈ ఆందోళనలు చెలరేగాయి. అయితే ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ట్రంప్‌.. పోలీసులకు సహకరించాలని, సంయమనం పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ చట్టసభ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘హింస ఎన్నటికీ గెలవదు. స్వేచ్ఛ మాత్రమే విజయం సాధిస్తుంది. ఇప్పటికీ ఇది ప్రజల సభ మాత్రమే’’ అని పేర్కొన్నారు. ఆందోళనకారుల చర్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు.

>
మరిన్ని వార్తలు