‘వీసా వెయిటింగ్‌’ తగ్గిస్తాం: అమెరికా

19 Jan, 2023 02:19 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా వీసాల కోసం భారతీయులు వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని యూఎస్‌కౌన్సిలర్‌ అఫైర్స్‌ బ్యూరోలో వీసాల జారీ విభాగం ఉన్నతాధికారి జూలీ స్టఫ్‌ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నారన్నారు.

‘‘గత అక్టోబర్‌లో బిజినెస్‌(బీ1), పర్యాటక(బీ2) వీసాల వెయిటింగ్‌ పీరియడ్‌ మూడేళ్లుంది! వీటిని తగ్గించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. కోవిడ్‌కు ముందునాటి సాధారణ స్థాయికి తేవడంపై దృష్టిసారించాం. హెచ్‌–1బీ, ఎల్‌1 వీసాల వెయిటింగ్‌ పీరియడ్‌ను 18 నెలల నుంచి 60 రోజులకు కుదించగలిగాం’’ అని ఆమె చెప్పారు.

‘‘ఇంటర్వ్యూతో పనిలేని సందర్భాల్లో వీసా రెన్యువల్‌కు వేచి ఉండాల్సిన పనిలేదు. ఇండియాతోపాటు జర్మనీ, థాయ్‌లాండ్‌లలోనూ భారతీయుల వీసా జారీ కోసం ఎంబసీలు, కాన్సులేట్‌లకు మరింత మంది సిబ్బందిని పంపుతున్నాం. వారాంతాల్లోనూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు’’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు