చైనా తీరుపై యూకే, యూఎస్‌, జర్మనీ విమర్శలు

26 Aug, 2020 18:58 IST|Sakshi
ఉగర్‌ ముస్లింల నిర్బంధాన్ని నిరసిస్తూ ర్యాలీ(ఫొటో కర్టెసీ: రాయిటర్స్‌)

ఉగర్‌ ముస్లింల పట్ల చైనా తీరును తప్పుబట్టిన అమెరికా, యూకే, జర్మనీ

న్యూయార్క్‌: ఉగర్‌ ముస్లింల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని అమెరికా, యూకే, జర్మనీ తీవ్రంగా విమర్శించాయి. ఉగ్రవాద నిర్మూలన పేరిట మైనార్టీ వర్గాల హక్కులను డ్రాగన్‌ కాలరాస్తోందని మండిపడ్డాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా ఆయా దేశాల ప్రతినిధులు చైనా తీరును ఎండగట్టాయి. ఈ నేపథ్యంలో యూఎన్‌లో అమెరికా శాశ్వత ప్రతినిధి కెల్లీ క్రాఫ్ట్‌ మాట్లాడుతూ.. ‘‘జింగ్‌జియాంగ్‌లో నివసిస్తున్న పది లక్షలకు పైగా ఉగర్లు, ఇతర ముస్లింలను ఉగ్రవాద నిరోధక చర్యల పేరిట అక్రమంగా బంధించడం పట్ల ఆందోళనగా ఉంది. తీవ్ర వాదాన్ని అణిచివేసే పేరిట భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకోవడం సరైంది కాదు. మత స్వేచ్చను హరించి మైనార్టీ వర్గాలను అణగదొక్కేందుకే ఇలా వ్యవహరిస్తున్నారు’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: చైనాలో మసీదులు కూల్చివేత.. పాక్‌ మౌనం)

ఇక యూకే ప్రతినిధి జేమ్స్‌ రాస్కో సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉగర్లు, ఇతర భిన్న మైనార్టీ జాతుల పట్ల అణచివేత వైఖరి ప్రదర్శిస్తూ.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం సరికాదని డ్రాగన్‌కు హితవు పలికారు. ఉగ్రవాదాన్ని రూపుమాపే పేరిట మైనార్టీలను నిర్బంధించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని జర్మనీ రాయబారి విమర్శించారు. కాగా హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు చైనా తీసుకువచ్చిన విధానాలపై కూడా పలు దేశాలు ఇప్పటికే యూఎన్‌ఎస్‌సీ రహస్య సమావేశంలో చర్చను లేవనెత్తాయి. అయితే డ్రాగన్‌ మాత్రం తమ అంతర్గత విషయాల్లో ఇతర దేశాల జోక్యం అనవసరమని తేల్చిచెప్పింది.(చదవండి: విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!)

కాగా వాయువ్య చైనాలో గల జిన్‌జియాంగ్‌ (జిన్‌జియాంగ్‌ ఉగర్‌ అటానమస్‌ రీజియన్‌(ఎక్స్‌యూఏఆర్‌)ను స్వయంప్రతిపత్తి గల ప్రాంతంగా గుర్తించిన డ్రాగన్‌.. అక్కడ నివసిస్తున్న వేలాది ముస్లింలను అనధికారికంగా నిర్బంధించిన విషయాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు