భారత్‌-పాక్ సంబంధాలపై అమెరికా కీలక ‍వ్యాఖ్యలు.. మేం కోరుకునేది ఇది కాదు..

20 Dec, 2022 13:28 IST|Sakshi

వాషింగ్టన్: భారత్-అమెరికా సంబంధాలపై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు దేశాల మధ్య తాము మాటల యుద్ధం కోరుకోవటం లేదని చెప్పింది. సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్చలు చేపట్టాలని సూచించింది. అగ్రరాజ్యం విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఈమేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు.

భారత్‌తో అమెరికాకు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అటు పాకిస్తాన్‌తోనూ తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని ప్రైస్ పేర్కొన్నారు. ఈ రెండు దేశాలతో సంబంధాలను ఒకదానికొకటి ముడిపెట్టలేమని వివరించారు. 

భారత్-పాక్ మధ్య మాటల యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు.  ప్రధానీ మోదీపై పాక్ మంత్రి బిలావల్ భుట్టో చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా ఈమేరకు బదులిచ్చారు. రెండు దేశాలతోనూ ద్వైపాక్షిక సంబంధాలు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. భారత్‌-పాక్ నిర్మాణాత్మక చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటే రెండు దేశాల ప్రజలకు శ్రేయస్కరం అని పేర్కొన్నారు.

2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారత్‌పై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతోంది. పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ వ్యవహారంపై రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే అమెరికా స్పందించింది.
చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..!

మరిన్ని వార్తలు