అమెరికాలో ‘చైనా’ విత్తన ప్యాకెట్ల కలకలం!

29 Jul, 2020 15:39 IST|Sakshi

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా  భయాల నేపథ్యంలో చైనా నుంచి వచ్చిన ప్యాకేజీల్లోని విత్తనాలను నాటవద్దని అమెరికా వ్యవసాయ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన పార్శిళ్లలోని సీడ్స్‌ నాటినట్లయితే పంటలపై తీవ్ర ప్రభావం చూపై అవకాశం ఉందని హెచ్చరించింది. విత్తనాల కవర్లను జాగ్రత్తగా దాచిపెట్టాలని, తాము వచ్చి వాటిని స్వాధీనం చేసుకుంటామని సంబంధిత శాఖా అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా చైనా పేరు చెబితేనే భయపడే పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాణాంతక వైరస్‌ అమెరికాలో అల్లకల్లోలం సృష్టించిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆది నుంచి డ్రాగన్‌ దేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య దౌత్య, వాణిజ్యపరమైన యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది.(ముదిరిన దౌత్య యుద్ధం: కీలక పరిణామం)

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల చైనా నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న కొన్ని పార్శిళ్లు అగ్రరాజ్యంలో కలకలం సృష్టిస్తున్నాయి. వాషింగ్టన్‌, వర్జీనియా, టెక్సాస్‌ తదితర రాష్ట్రాల్లో పలు ఇళ్ల ఎదుట మెయిల్‌ బాక్సుల్లో విత్తనాల ప్యాకెట్లతో కూడిన కవర్లు దర్శనమివ్వడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగంతో కలిసి మిస్టీరియస్‌ కొరియర్లపై ఆరా తీస్తున్నామని, దయచేసి అందులో ఉన్న విత్తనాలు భూమిలో నాటవద్దని విజ్ఞప్తి చేశారు. 

అదే విధంగా అధికారులు వచ్చి వాటిని స్వాధీనం చేసుకుంటారని.. మరోసారి ఇలాంటి కవర్లు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మరోవైపు.. ఈ విత్తనాలు నాటితే పర్యావరణం దెబ్బతింటుందని, ఇతర పంటలపై కూడా ఇవి దుష్ర్పభావం చూపుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక అమెరికాలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి.. తమ దేశ తపాలా వ్యవస్థ ప్రతీ విషయంలోనూ కచ్చితమైన నిబంధనలు పాటిస్తుందని, ప్యాకెట్ల మీద చైనా భాష ఉన్నంత మాత్రాన తమపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.

మరిన్ని వార్తలు