Russia Ukraine War: ఉక్రెయిన్‌ చేతికి అమెరికా రాకెట్లు!

2 Jun, 2022 11:44 IST|Sakshi
ఉక్రెయిన్‌కు అమెరికా అందజేయనున్న రాకెట్‌ వ్యవస్థలు ఈ తరహావే

అధునాతన మధ్యశ్రేణి రాకెట్‌ వ్యవస్థల అందజేత

జో బైడెన్‌ ప్రభుత్వం వెల్లడి

అతి త్వరలో అమెరికా ఆయుధ ప్యాకేజీ ఆవిష్కరణ 

డోన్బాస్‌లో రష్యా దళాలను మట్టికరిపించడానికే..

రష్యా భూభాగంపై దాడులు చేయొద్దని అగ్రరాజ్యం ఆంక్షలు

వాషింగ్టన్‌/కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పదేపదే చేస్తున్న విజ్ఞప్తి పట్ల అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. ఉక్రెయిన్‌కు హైటెక్, మీడియం రేంజ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ అందజేస్తామని ప్రకటించింది. ఇవి తక్కువ సంఖ్యలోనే పంపిస్తామని పేర్కొంది. ఉక్రెయిన్‌కు ఇప్పటికే ప్రకటించిన 700 మిలియన్‌ డాలర్ల భద్రతాపరమైన సాయంలో భాగంగానే రాకెట్‌ సిస్టమ్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇందులో రాకెట్‌ సిస్టమ్స్‌తోపాటు హెలికాప్టర్లు, జావెలిన్‌ యాంటీ–ట్యాంకు ఆయుధ వ్యవస్థ, టాక్టికల్‌ వాహనాలు, విడిభాగాలు ఉంటాయని అమెరికా ఉన్నతాధికారులు మంగళవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు ఇవ్వనున్న ఆయుధ ప్యాకేజీని అతిత్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. అమెరికా ఇచ్చే ఆయుధాలు ఉక్రెయిన్‌లో తిష్టవేసిన రష్యా సైన్యంపై పోరాటానికే పరిమితం కానున్నాయి. సరిహద్దును దాటి రష్యా భూభాగంలో దాడి చేసే ఆయుధాలను ఉక్రెయిన్‌కు తాము ఇవ్వబోమని అమెరికా గతంలోనే తేల్చిచెప్పింది.

అలాచేసే సంక్షోభం మరింత ముదురుతుందని అమెరికా భావిస్తోంది. ఉక్రెయిన్‌కు అడ్వాన్స్‌డ్‌ రాకెట్‌ సిస్టమ్స్, ఆయుధాలు అందజేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం ధ్రువీకరించారు. ఉక్రెయిన్‌ భూభాగంలో శత్రు శిబిరాలను ధ్వంసం చేయడానికి తమ ఆయుధాలు ఉపయోగపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దులకు ఆవల దాడులు చేయడాన్ని తాము ప్రోత్సహించబోమన్నారు. యుద్ధం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటో రష్యాకు తెలిసేలా చేయడమే తమ ఉద్దేశమన్నారు.

డోన్బాస్‌లో వినియోగం!  
ఉక్రెయిన్‌కు తాము ఇవ్వనున్న మీడియం రేంజ్‌ రాకెట్లు 70 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తాయని, నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదిస్తాయని అమెరికా అధికారులు తెలిపారు. వీటి సాయంతో రష్యా భూభాగంపై దాడి చేయబోమంటూ ఉక్రెయిన్‌ పాలకులు హామీ ఇచ్చారన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌లో రష్యా బలగాల భరతం పట్టేందుకు అమెరికా ఆయుధాలను ఉక్రెయిన్‌ సైన్యం రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌కు అమెరికా హై మొబిలిటీ ఆర్టిల్లరీ రాకెట్‌ సిస్టమ్స్‌(హైమార్స్‌) ఇవ్వబోతోంది. ఒక్కో కంటైనర్‌లో ఆరు రాకెట్లు ఉంటాయి. ఉక్రెయిన్‌కు అత్యాధునిక యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్‌ క్షిపణులు, రాడార్‌ సిస్టమ్స్‌ ఇస్తామని జర్మనీ చాన్సరల్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రకటించారు. ఇలా అగ్నికి ఆజ్యం పోయొద్దంటూ రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ఘాటుగా స్పందించారు.

నిత్యం 60–100 మంది ఉక్రెయిన్‌ జవాన్లు బలి
రష్యాపై యుద్ధంలో తమకు జరుగుతున్న ప్రాణ నష్టంపై ఇన్నాళ్లూ పెదవి విప్పని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ అంశంపై ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. యుద్ధంలో నిత్యం 60 నుంచి 100 మంది సైనికులను కో ల్పోతున్నామని, మరో 500 మంది దాకా క్షతగాత్రులవుతున్నారని చెప్పారు. డోన్బాస్‌ లో భాగమైన డోంటెస్క్, లుహాన్‌స్క్‌లో పరిస్థితి అత్యంత సక్లిష్టంగా ఉందని పేర్కొన్నారు.

రష్యా అణు విన్యాసాలు  
అణ్వస్త్రాలను నిర్వహించే తమ సిబ్బంది తాజాగా విన్యాసాలు నిర్వహించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యు ద్ధం నేపథ్యంలో ఇవానోవోలో ఈ విన్యాసాలు జరిగాయని తెలిపింది. వ్యూహాత్మక క్షిపణి దళాలు సైతం ఇందులో పాల్గొన్నాయని పేర్కొంది. పూర్తి వివరాలను వెల్లడించలేదు.  

చదవండి: రష్యా ఆర్థికంపై దెబ్బేసే నిర్ణయం! ఏంటంటే..

మరిన్ని వార్తలు