పసిప్రాయంలో కిడ్నాప్.. 51 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు.. ఎలా దొరికిందంటే..?

29 Nov, 2022 11:54 IST|Sakshi

వాషింగ్టన్‌: ఊహ కూడా తెలియని పసిప్రాయంలోనే ఆ బాలిక కిడ్నాపైంది. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకుకుండా పరాయి ఇంట్లోనే పెరిగింది. అయితే విధి ఆమెను మళ్లీ కుటుంబంతో కలిసేలా చేసింది. 51 ఏళ్ల తర్వాత ఆ మహిళ  తన ఇంటికి చేరుకుంది. అమెరికా టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

అల్టా అపంటెంకో అనే మహిళకు ఓ పాప ఉండేది. ఉద్యోగం వల్ల తీరక లేకపోవడంతో చిన్నారి ఆలనా పాలనా చూసుకునేందుకు ఓ ఆయాను నియమించాలనుకుంది. ఆమె రూమ్ మేట్ ఓ మహిళ ఉందని చెప్పడంతో వివరాలేవి తెలుసుకోకుండానే పనిలో పెట్టుకుంది. అయితే వచ్చిన ఆయా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పాపను కిడ్నాప్ చేసింది. 1971 ఆగస్టు 23న ఈ ఘటన జరిగింది.

చిన్నారి కన్పించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు ఎంత వెతికినా పాప ఆచూకీ లభించలేదు. తల్లిమాత్రం తన బిడ్డ కోసం అప్పటినుంచి వెతుకుతూనే ఉంది.

చివరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ బిడ్డ ఫోర్ట్ వర్త్‌కు 1100 మైళ్ల దూరంలో ఉందనే విషయం బంధువుల ద్వారా అల్టాకు తెలిసింది. వెంటనే వాళ్లు అధికారులను సంప్రదించి డీఎన్‌ఏ టెస్టు నిర్వహించాలని చెప్పారు. పాప పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు, డీఎన్‌ఏ ఫలితాల ఆధారంగా 51 ఏళ్ల క్రితం కిడ్నాపైంది ఈమే అని అధికారులు నిర్ధరించారు.
దీంతో బాల్యంలో తప్పిపోయిన మెలిస్సా హై స్మిత్‌ ఐదు దశాబ్దాల తర్వాత కుటుంబం చెంతకు చేరింది. తన వాళ్లతో కలిసి చర్చిలో నిర్వహించిన వేడుకలో పాల్గొంది. ఇన్నేళ్ల తర్వాత తమబిడ్డను చూసి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆనంద పరవశంలో మునిగిపోయారు.

బిడ్డను చంపిందనే అపవాదు..
అయితే దర్యాప్తు అధికారులు ఈ కేసును చాలా సార్ల తప్పుదోవ పట్టించారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గైనకాలజిస్ట్ సాయంతోనే తమబిడ్డ దక్కినట్లు పేర్కొంది. పాప కిడ్నాపై చాలా సంవత్సరాలు కన్పించకపోవడంతో తల్లే ఆమెను హత్య చేసి ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు ఆ దుష్ప్రచారానికి తెరపడింది.
చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్‌ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..!

మరిన్ని వార్తలు