వ్యాక్సిన్‌ పేటెంట్‌ ఎత్తివేతకు అగ్రరాజ్యం మద్దతు

6 May, 2021 12:30 IST|Sakshi

వాషింగ్టన్: ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకట్టకు టీకాతోనే సాధ్యమని భావించి ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో నిమగ్నమైయ్యాయి. అయితే పేటెంటు ఫీజుల కారణంగా టీకాల ధర పెరగుతుండడంతో ఈ ప్రభావం పేద దేశాలపై పడుతుంది. దీంతో ఖరీదైన టీకాలు కొనలేక వారు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ప్రస్తుత విశ్వవ్యాప్త సంక్షోభం దృష్ట్యా ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే భారత్ సహా దక్షిణాఫ్రికా దేశాలు అమెరికాకు విజ్ఞప్తి చేశాయి. తాజాగా ఈ విషయం పై అగ్రరాజ్యం సానుకూలంగా స్పందించింది.

అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం.. 
మేధో సంపత్తి హక్కులు ముఖ్యమే అయినప్పటికీ మహమ్మారిని అందరూ కలిసి అంతం చేయాల్సి ఉన్నందున పేటెంట్‌ మినహాయింపును వైట్‌హౌస్‌ వర్గాలు సమర్థిస్తున్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరిన్ టాయ్ ప్రకటించారు. “ఇది అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం. అసాధారణ పరిస్థితుల్లో మనమంతా ఉన్నాం. అందుకు మన ప్రతిస్పందన చర్యలు కూడా అసాధారణంగానే ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ జరిపే ఏకాభిప్రాయ సాధన కృషికి కొంత సమయం పట్టవచ్చని ఆమె గుర్తు చేశారు.

అమెరికాకు సరిపడా సరఫరాలు సమకూరినందున ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం టీకాల ఉత్పాదన, పంపిణీ విస్తరణపై దృష్టి పెట్టిందని ఆమె వివరించారు. అలాగే టీకా ముడి పదార్థాల ఉత్పత్తి పెంచేందుకు కూడా కృషి చేస్తుందని టాయ్ తెలిపారు. ఓ కోణంలో ధనిక దేశాలు వ్యాక్సిన్లను నిల్వ చేస్తున్నాయనే విమర్శలు బైడెన్  ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేశాయనే చెప్పాలి. 
 

భారత్‌కు సానుకూలంగా స్పందిస్తున్న అగ్రరాజ్యం
కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రస్తుతం భారత్‌కు తోడుగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని ఇటీవల శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ చెప్పారు. ఔషధాలు, పరికరాలు, ప్రాణ వాయువు సిలిండర్లతో కూడిన మరికొన్ని విమానాలను భారత్‌కు పంపుతామని ప్రకటించారు. ఇదే కాక భారత్‌కు అమెరికా ఎంతో సహాయం చేస్తోంది. ప్రస్తుతం విజ్ఞప్తికి మద్దతు పలకడం చూస్తే బైడెన్‌ ప్రభుత్వం భారత్‌కు సానుకూలంగా స్పందిస్తోందని తెలుస్తోంది.

( చదవండి: భారత్‌కు ఎంతో సహాయం చేస్తున్నాం.. మరింత చేస్తాం )

మరిన్ని వార్తలు