మృత నక్షత్రాల్లో ఘోస్ట్‌ పార్టికిల్‌ ఆనవాళ్లు..!

21 Jan, 2021 08:50 IST|Sakshi

వాషింగ్టన్‌: అణు నిర్మాణం తెలిసిన వాళ్లకు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటికన్నా సూక్ష్మమైనవి, కీలకమైనవి పలు అణువుల్లో ఉంటాయని ఆధునిక భౌతిక శాస్త్రం వెల్లడిస్తోంది. ఇలాంటి సూక్ష్మాతిసూక్ష్మ అణువులలో చాలావాటి ఉనికిని గుర్తించడం కూడా జరిగింది. అయితే చాలా దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలకు అర్థం కాకుండా దాగుడుమూతలు ఆడుతున్న ఒక పార్టికిల్‌ కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. ఈ అంతుచిక్కని పార్టికిల్‌కు సైంటిస్టులు ముద్దుగా ‘ఘోస్ట్‌ పార్టికిల్‌’ అని పేరు పెట్టుకున్నారు. దీని శాస్త్రీయ నామం ‘యాక్జియాన్‌’. తాజాగా ఈ పార్టికిల్‌ ఆనవాళ్లు డెడ్‌ స్టార్స్‌(మృత నక్షత్రాలు) వెలువరించే ఎక్స్‌రే కిరణాల్లో కనిపించాయి. అమెరికాకు చెందిన చంద్ర టెలిస్కోప్‌ ద్వారా ఈ ఎక్స్‌రేలను గుర్తించారు. వీటి ఉనికి స్పష్టంగా బయటపడితే విశ్వ రహస్యాల్లో కొన్ని కీలకమైనవాటి గుట్టు బయటపడుతుందని సైంటిస్టులు సంబరపడుతున్నారు. ముఖ్యంగా ‘డార్క్‌ మ్యాటర్‌’ గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు. తాజా పరిశోధన వివరాలు ఫిజికల్‌ రివ్యూ లెటర్స్‌లో పబ్లిష్‌ అయ్యాయి. 

మిన్నిసోటా యూనివర్సిటీకి చెందిన రేమండ్‌ కో అభిప్రాయం ప్రకారం ’’ యాక్జియాన్స్‌ ఉనికి గుర్తించడం ఫిజిక్స్‌లో అతిపెద్ద ఘటనల్లో ఒకటి. ఇప్పటివరకు ఇవి ఉన్నాయని మాత్రమే నమ్ముతున్నాం. తొలిసారి వీటి ఉనికి స్పష్టంగా డెడ్‌స్టార్స్‌ నుంచి విడుదలయ్యే ఎక్స్‌రేల్లో కనిపించింది. మ్యాగ్నిఫిసెంట్‌ సెవెన్‌గా పిలిచే న్యూట్రాన్‌ స్టార్స్‌ నుంచి రావాల్సిన మోతాదుకు మించి ఎక్స్‌రే ఉద్ఘాటన గుర్తించారు. ఈ అదనపు ఎక్స్‌రేలు సదరు నక్షత్ర కోర్‌ భాగంలో ఉన్న యాక్జియాన్స్‌ వల్ల వచ్చాయని చెప్పవచ్చు’’ అని వివరించారు. న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఢీకొన్నప్పుడు ఈ యాక్జియాన్లు విడుదలవుతాయి. అనంతరం నక్షత్రం నుంచి వెలికి వచ్చినప్పుడు లైట్‌ పార్టికిల్స్‌గా మారి ఎక్స్‌రేల రూపంలో బహిర్గతమవుతాయని తాజాగా ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయితే సాధారణ లైట్‌ పార్టికిల్స్‌ కన్నా యాక్జియాన్లలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. వీటిని 1970ల్లో తొలిసారి ప్రతిపాదించారు. ఇవి ఉన్నాయని నిరూపితమవుతే డార్క్‌మ్యాటర్‌ కూడా ఉన్నట్లేనని సైంటిస్టులు భావిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు