అమెరికా సంచలన ప్రకటన: అఫ్గాన్‌ నుంచి బలగాలు వెనక్కి

16 Apr, 2021 03:51 IST|Sakshi

మే 1న ప్రారంభమై సెప్టెంబర్‌ నాటికి బలగాల ఉపసంహరణ పూర్తి

అఫ్గాన్‌ నుంచి సైన్యం ఉపసంహరణపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటన

వాషింగ్టన్‌: అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్‌ 11 నాటికి అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలన్నీ వెనక్కు వచ్చేస్తాయని ప్రకటించారు. అమెరికా అత్యధిక కాలం చేసిన యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందన్నారు. బైడెన్‌ బుధవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అఫ్గాన్‌లో యుద్ధం తరతరాల పాటు కొనసాగించేది కాదని బైడెన్‌ స్పష్టం చేశారు. ఏటా కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తూ ఒకే దేశంలో వేలాది సైనికులను మోహరించడం అర్థం లేని చర్య అని బైడెన్‌ అభివర్ణించారు.

అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొనడం కోసం మరిన్ని చర్యలు చేపట్టాలని భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్, టర్కీలను కోరారు. అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత, అవసరం ఆ దేశాలపై ఉందన్నారు. వైట్‌హౌజ్‌లోని ట్రీటీ రూమ్‌ నుంచి టీవీ మాధ్యమం ద్వారా బైడెన్‌ ప్రసంగించారు. అంతకుముందు, ఆయన మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జ్‌ బుష్‌లతో సంప్రదింపులు జరిపారు. అఫ్గాన్‌లో 2001 నుంచి కొనసాగుతున్న  యుద్ధంతో లక్షల కోట్ల డాలర్ల ఖర్చుతో పాటు దాదాపు 2400 మంది సైనికుల ప్రాణాలను అమెరికా కోల్పోయింది. బైడెన్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి సుమారు 3 వేల అమెరికా బలగాలు అఫ్గాన్‌లో ఉన్నాయి. మే 1 నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమవుతుందని బైడెన్‌ ప్రకటించారు. ‘మా నిష్క్రమణ హడావుడిగా ఏమీ ఉండదు. ప్రణాళికాబద్ధంగా, సురక్షితంగా ఈ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అఫ్గాన్‌లో మా కన్నా ఎక్కువ సంఖ్యలో బలగాలున్న మిత్రపక్షాలు, ఇతర భాగస్వాములతో సమన్వయంతో సాగుతాం’ అని వివరించారు.

‘2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై జరిగిన దాడికి ఇరవై ఏళ్లయ్యేనాటికి అమెరికా, నాటో దళాలు, ఇతర భాగస్వామ్యులు అఫ్గాన్‌ నుంచి వైదొలగుతాయి’ అని బైడెన్‌ స్పష్టం చేశారు. ప్రసంగం అనంతరం బైడెన్‌ ఆర్లింగ్టన్‌ నేషనల్‌ సిమెటరీకి వెళ్లి అఫ్గాన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. అఫ్గాన్‌ నుంచి బలగాలను ఉపసంహరించాలనే నిర్ణయంపై అత్యంత స్పష్టతతో ఉన్నామని అక్కడ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అమెరికా నిర్ణయంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ఉగ్రవాద శక్తులకు ఊతమిచ్చే అవకాశముందని పేర్కొంది. చైనా నుంచి వచ్చే ముప్పులపై దృష్టి పెట్టాల్సి ఉందన్న అమెరికా వ్యాఖ్యలపై మండిపడింది.

భారత్‌కు ఆందోళనకరం
అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వైదొలగితే ఆ ప్రాంతం మళ్లీ ఉగ్రవాద సంస్థలకు సురక్షిత ప్రదేశంగా మారే ప్రమాదముందని నిపుణులు భావిస్తున్నారు. తాలిబన్‌ మళ్లీ మరింత క్రియాశీలమయ్యే అవకాశముందని, అమెరికా నిర్ణయంతో భారత్‌కు ఉగ్ర ముప్పు మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్తున్నారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు