పిల్లలాడుకునే బొమ్మనుకుని ‘చావు’తో ఆడుకున్నారు..

7 Jun, 2021 19:18 IST|Sakshi

అమెరికాలో చోటు చేసుకున్న ఘటన

రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబ్‌తో ఆడుకున్న ఫ్యామిలీ

వాషింగ్టన్‌: భార్యాభర్తలు పిల్లలతో కలిసి సరదాగా పిక్నిక్‌కు వెళ్లారు. అక్కడ నదిలో వారికి ఓ వింత వస్తువు కనిపించింది. చూడ్డానికి పిల్లలాడుకునే బొమ్మలా ఉన్న దాంతో కాసేపు ఆడుకున్నారు. తర్వాత ఆ వస్తువును వారు నదిలో ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెట్టారు. ఆ తర్వాత వస్తువు గురించి నిజం తెలిసి ఒక్కసారిగా గుండె జారినంత పనయ్యింది. ఎందుకంటే వారు పార్క్‌లో ఆడుకున్న వస్తువు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పేలని బాంబు. చదువుతుంటేనే గుండె జారి పోతుంది కదా.. ఆ వివరాలు..

అమెరికాకు చెందిన డేవిడ్‌, కరెన్‌ హబ్బర్ట్‌ తమ పిల్లలతో కలిసి నాటింగ్‌హామ్‌షైర్‌లోని నెవార్క్‌లోని థోర్స్‌బీ పార్క్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో డేవిడ్‌కు పక్కనే ఉన్న నదిలో ఓ వింత వస్తువు కనిపించింది. దాన్ని తెచ్చి భార్యకు చూపించాడు. ఈ ఇనుప వస్తువును చూస్తే.. ఏదో పేలుడు పదార్థంలాగా అనిపిస్తుంది అన్నాడు. కానీ డేవిడ్‌ భార్య అతడి మాటలు కొట్టి పారేసింది. దాన్ని కేవలం పిల్లలు ఆడుకునే వస్తువుగా తేల్చింది. దాన్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చాడో.. అక్కడే పెట్టమంది. 

భార్య మాట ప్రకారం డేవిడ్‌ దాన్ని నదిలో పెట్టేసి వచ్చాడు. ఆ తర్వాత వారు బాంబుకు పది మీటర్ల దూరంలో పిల్లలతో కలిసి చేపలు పట్టారు.. ఆడుకున్నారు.. తిరిగి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కరెన్‌ థోర్స్‌బీ పార్క్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌లో తాము కనుగొన్న వస్తువు గురించి చూసి ఆశ్చర్యపోయింది. ఆ పోస్ట్‌ మొత్తం చదివి భయంతో కుప్పకూలింది. పార్క్‌ వారు తెలిపిన వివరాల ప్రకారం.. డేవిడ్‌ కనుగొన్న ఆ మెటల్‌ వస్తువు రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబని.. దాని నుంచి దూరంగా ఉండాలని.. పట్టుకోవద్దని సూచించింది. పార్క్‌లో ఎక్కడైనా ఇలాంటి మెటల్‌ వస్తువులు కనిపిస్తే.. వెంటనే తమ పార్క్‌ సిబ్బందికి తెలపాలని.. వారు దాన్ని జాగ్రత్తగా డిఫ్యూజ్‌ చేస్తారని పేర్కొంది. 

ఈ సందర్భంగా కరెన్‌ మాట్లాడుతూ.. ‘‘నిజం తెలిసిన తర్వాత దీని గురించి నా భర్తకు తెలపాలంటే భయపడ్డాను. నిజంగా ఇది నమ్మశక్యంగా లేదు. నేను షాకయ్యాను’’ అన్నది. ఇక గతంలో ఈ పార్క్‌ రెండో ప్రపంచ యుద్ధ స్థావరంగా ఉండేదని తర్వాత తెలిసింది.

చదవండి: రెండో ప్రపంచ యుద్దం: 5 వేల కిలోల బాంబు పేలుడు


 

మరిన్ని వార్తలు