పిసినారి పెళ్లాంతో భర్తకి చుక్కలే.. తిండికి కూడా పైసా వసూల్‌

8 Aug, 2021 13:39 IST|Sakshi

‘పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభావన’ అనేది ఓ సామెత. గీసిగీసి బేరమాడే వాళ్లని, పావలాకు పదిరూపాయలు  లాభం కోరుకునేవాళ్లని.. పీనాసి సంఘంలో చేర్చి మరీ ఎండగట్టినా మారరు. పైపెచ్చు అదేదో ఘనకార్యమన్నట్లుగా పొంగిపోతుంటారు ‘అహా నా పెళ్లంట’ సినిమాలోని  కోట శ్రీనివాసరావు మాదిరి. ఆ కోవలోకి చెందిందే అమెరికా వాసి.. నలభై ఒక్కేళ్ల బికీ గుయిలీస్‌. ‘అమెరికాలోనే అత్యంత పినాసి మహిళ’గా పేరు తెచ్చుకుంది.

వాటర్‌ బిల్లు చెల్లించడం కూడా ఇష్టం లేని గుయిలీస్‌.. ఇంటి ముందు కురిసే మంచు సేకరించి దాన్ని నీరుగా మార్చి ఇంటి అవసరాలకు వాడుతుంది. ఈమె పీనాసితనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్రీ బై లేడీ’ పేరుతో తన పొదుపు సూత్రాలను పంచుకుంటున్న గుయిలీస్‌..  భర్త జాయ్‌కు తిండి పెట్టడానిక్కూడా డబ్బు తీసుకుంటుందట.‘తిండి విషయంలో కూడా నేను చాలా పొదుపుగా ఉంటాను. నా భర్త నేను తినే ఆహారం కంటే ఎక్కువ తింటే.. అందుకుగాను అతడు నాకు డబ్బు చెల్లించాల్సిందే. ఆ మొత్తాన్ని ఇంటి అవసరాల కోసం దాచిపెడతాను. నేను ఏదైనా వస్తువు కొనాలంటే అది 90 శాతం చవకదైనా అయ్యుండాలి లేదా ఉచితంగానైనా రావాలి. మొదట్లో ఇంత పొదుపుగా ఉండేదాన్ని కాదు.

మా పెద్దబ్బాయి పుట్టాక ఏడాదికి 30 వేల డాలర్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంటి బాధ్యతలు స్వీకరించాను. అకస్మాత్తుగా ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అందుకే అవసరాలన్నింటినీ తగ్గించడం మొదలుపెట్టాను. చివరికి ఇంటి మరమ్మత్తులు కూడా నేనే చేసుకుంటాను’ అని చెప్పుకొస్తుంది గుయిలీస్‌. అయితే ఈ కథ విన్నవారంతా  పొదుపు మంచిదే  కానీ పొట్ట కట్టుకుని మరీ ఇంతలా చేయాలా? అని విస్తుపోతున్నారు. భార్య పీనాసి తనాన్ని భరిస్తున్న జాయ్‌ మీద సానుభూతి చూపిస్తున్నారు. 
  

మరిన్ని వార్తలు