రష్యా రెక్కలు విరుస్తాం: బైడెన్‌

25 Feb, 2022 05:04 IST|Sakshi

మరో 4 బ్యాంకులపై ఆంక్షలు

రష్యా కుబేరుల ఆస్తుల జప్తు

పుతిన్‌ నియంత, యుద్ధ పిపాసి

దోషిగా చరిత్రలో మిగిలిపోతారు

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నియంతగా, యుద్ధ పిపాసిగా అభివర్ణించారు. అకారణ యుద్ధానికి దిగినందుకు ఆయన దోషిగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయమన్నారు. జీ7 దేశాల నేతలతో గంటకు పైగా వర్చువల్‌గా చర్చించాక భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక బైడెన్‌ మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా, ఇతరత్రా కూడా రష్యా రెక్కలు విరిచేస్తామన్నారు. ‘‘మరో నాలుగు అతి పెద్ద రష్యా బ్యాంకులపై, పుతిన్‌కు సన్నిహితులైన ఆ దేశ కుబేరులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాం. ఆ బ్యాంకులకు, సంపన్నులకు చెందిన అన్ని ఆస్తులనూ జప్తు చేస్తున్నాం. ఇక అమెరికా, యూరప్‌ ఆర్థిక వ్యవస్థలతో రష్యాకు సంబంధాలన్నీ తెగిపోయినట్టే.

చదవండి: (Vladimir Putin: రష్యా అధ్యక్షుడికి ఎక్కడిదీ బరి తెగింపు!)

డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్‌ కరెన్సీల్లో ఇకపై రష్యా ఎలాంటి లావాదేవీలు చేయలేదు. ఆ దేశ ఎగుమతులు, దిగుమతుల సామర్థ్యం తీవ్రంగా దెబ్బ తీస్తాం. ఇవన్నీ యూరోపియన్‌ యూనియన్, జపాన్‌ తదితర దేశాలతో కలిసి అమెరికా సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలు. త్వరలో రష్యాపై మరిన్ని అతి కఠిన ఆంక్షలుంటాయి’’ అని ప్రకటించారు. తూర్పు యూరప్‌లోని నాటో స్థావరాలకు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తున్నట్టు చెప్పారు. నాటో దేశాలకు చెందిన ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటామన్నారు. ఉక్రెయిన్‌ క్షేమం కోసం ప్రపంచ దేశాలన్నింటితో కలిసి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆ దేశానికి నైతికంగా, మానవతా దృక్పథంతో అన్ని రకాల సాయమూ చేస్తామన్నారు.  

చదవండి: (Russia Ukraine War Effect: ప్రపంచం చెరి సగం.. భారత్‌ ఎందుకు తటస్థం?)

మరిన్ని వార్తలు