అమెరికన్ల జీవితాలు మారుతాయ్‌!

12 Mar, 2021 03:18 IST|Sakshi

1.9 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం

‘సాయం ఇక్కడ ఉంది’ అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ట్వీట్‌

వాషింగ్టన్‌: కరోనా సంక్షోభంతో అతాలాకుతలమవుతున్న అమెరికా పౌరుల్ని ఆదుకోవడానికి 1.9 లక్షల కోట్ల అమెరికా డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. 220–211 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ యాక్ట్‌ని ఆమోదించింది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఈ ప్యాకేజీకి వ్యతిరేకంగానే ఓటు వేశారు. నాలుగు రోజుల క్రితం సెనేట్‌ ఆమోదం పొందిన బిల్లుని అక్కడ కూడా రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కోవిడ్‌–19 సంక్షోభం తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ఈ భారీ ప్యాకేజీ ప్రకటించడం ఎందుకనేది వారి వాదనగా ఉంది. అయితే కాంగ్రెస్‌ దీనిని ఆమోదించగానే ‘‘సాయం ఇక్కడే ఉంది’’అని అధ్యక్షుడు జో బైడెన్‌ ట్వీట్‌ చేశారు. తాను ఆ బిల్లుపై శుక్రవారం సంతకం చేస్తానని చెప్పారు.

బిల్లు చట్టరూపం దాల్చగానే అమెరికాలో తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలకు ఈ ఏడాది 1400 డాలర్ల ఆర్థిక సాయం చేస్తారు. నిరుద్యోగులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ఆదుకుంటారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ, కోవిడ్‌పై పరిశోధనలకు నిధుల్ని భారీగా ఖర్చు పెడతారు. కోవిడ్‌–19తో కుదేలైన విమానయానం నుంచి ఫంక్షన్‌ హాల్స్‌ వరకు అందరికీ ఈ ప్యాకేజీ ద్వారా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. ఎన్నికల్లో బైడెన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఈ బిల్లు ఆమోదం పొందడం అత్యంత అవసరం. అందుకే చట్టసభల్లో బైడెన్‌ సాధించిన తొలి విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ప్రజల జీవితాలను మార్చే నిర్ణయం ఇదేనని ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి చెప్పారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే అమెరికాలో ప్రస్తుతం పేదల సంఖ్య 4.4 కోట్ల నుంచి 2.8 కోట్లకు తగ్గిపోతుందని అంచనాలున్నాయి.  

మరిన్ని వార్తలు