ఎంతో చేయాలి.. సమయమే లేదు

22 Jan, 2021 01:32 IST|Sakshi
అధ్యక్షభవనంలోని ఓవల్‌ ఆఫీసులో మొట్టమొదటి ఉత్తర్వులపై సంతకం చేస్తున్న బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తొలిరోజే బిజీ బిజీ

17 ఉత్తర్వులు జారీ

మాస్కులు తప్పనిసరి చేస్తూ మొదటి  సంతకం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జో బైడెన్‌ పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమయ్యారు. డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలను తిరగతోడుతూ పాలనలో తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చేయాల్సిందెంతో ఉంది, సమయమే తక్కువ ఉందని వ్యాఖ్యానించిన బైడెన్‌ తొలిరోజే బిజీ బిజీగా గడిపారు. కరోనా విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి రేయింబవళ్లు పని చేయాలని అన్నారు.  కోవిడ్‌–19పై పోరాటం నుంచి పారిస్‌ ఒప్పందంలో తిరిగి చేరేవరకు తొలిరోజే పలు నిర్ణయాలను తీసుకున్నారు. మొత్తం 17 ఉత్తర్వులు జారీ చేశారు.  కరోనా కట్టడికి ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడి హోదాలో బైడెన్‌ విలేకరుల ఎదుటే  తొలి సంతకం చేశారు.

బైడెన్‌ ప్రధాన నిర్ణయాలివే..
► బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి. 100 రోజుల మాస్కు చాలెంజ్‌ని స్వీకరించాలి.  ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతికదూరం తప్పనిసరి. ఒబామా హయాంలో ఏర్పాటైన డైరెక్టరేట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ అండ్‌ బయోడిఫెన్స్‌ పునరుద్ధరణ. అందరికీ వ్యాక్సిన్‌ అందేలా చర్యలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలో తిరిగి చేరిక.

► 1.1 కోట్ల డాలర్ల రుణాలపై మారటోరియం, విద్యార్థి రుణాల రికవరీ గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు

► ట్రంప్‌ హయాంలో మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం నిమిత్తం జాతీయ అత్యవస ర నిధి కింద విరాళాల సేకరణ  నిలిపివేత

► పర్యావరణ పరిరక్షణకు పారిస్‌ ఒప్పందంలో తిరిగి చేరేలా ఉత్తర్వులు జారీ. గత ఏడాది ట్రంప్‌ ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు. బైడెన్‌ ఆ నిర్ణయాన్ని మారుస్తూ తిరిగి ఒప్పందంలో చేరాలని నిర్ణయించారు. అయితే అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెలరోజులు పడుతుంది. కీస్టోన్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టు రద్దు చేశారు.

► మానవ హక్కులకు  భంగం వాటిల్లకుండా చర్యలు. జాతి వివక్షకు తావు లేకుండా ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ. నిధుల విడుదల అన్ని ప్రాంతాలకు సక్రమంగా జరిగేలా ప్రభుత్వ సంస్థలు సమీక్షిస్తూ ఉండాలి. పని చేసే ప్రాంతాల్లో  లింగ వివక్షకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు. ఎల్‌జీబీటీక్యూ హక్కుల పరిరక్షణ

► జనాభా లెక్కల సేకరణ. వీరిలో అమెరికన్లు కాని వారిని కూడా చేర్చాలి. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారిని జనాభా లెక్కల్లో చేర్చవద్దంటూ ట్రంప్‌ చేసిన ఆదేశాలు రద్దు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ.

► లైబీరియా నుంచి వలస వచ్చి కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరనివాసం ఉంటున్న  వారిని తిరిగి స్వదేశానికి పంపించే కార్యక్రమం వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు వాయిదా

► వివిధ ముస్లిం దేశాల నుంచి ట్రంప్‌ విధించిన ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత. 2017లో ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే సిరియా, ఇరాన్, ఇరాక్, సూడాన్, లిబియా, యెమన్‌ వంటి దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. అలా 13 దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలున్నాయి. వాటినన్నింటినీ ఎత్తివేస్తూ బైడెన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశాల నుంచి వీసా దరఖాస్తులు తీసుకోవాలం టూ విదేశాంగ శాఖను ఆదేశించారు.

వలస విధానం ప్రక్షాళన
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తొలి రోజే వలస విధానాన్ని సమూలంగా సంస్కరిస్తూ రూపొందించిన కొత్త ఇమిగ్రేషన్‌ బిల్లుని కాంగ్రెస్‌కు పంపించారు. వలసదారులకు పూర్తిగా అండదండలుగా ఉండేలా పౌరసత్వ చట్టం 2021 పేరుతో ఈ బిల్లుని తీసుకువచ్చారు. సరిహద్దుల సక్రమ నిర్వహణ, కుటుం బాలను ఏకం చెయ్యడం, అమెరికా ఆర్థిక వ్యవస్థకి సహకరించే ప్రతీ ఒక్కరి ప్రయో జనాల పరిరక్షణ, శరణార్థులకి అమెరికా అండదండలు ఉంటాయన్న లక్ష్యాలతో ఈ బిల్లుని రూపొందించారు. దీని ప్రకారం చట్టవిరుద్ధంగా దేశంలో తలదాచుకుం టున్న 1.1 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఇక ఏళ్ల తరబడి వేచి చూడనక్కర్లేదు. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీలో దేశాల కోటా పరిమితుల్ని రద్దు చేసే ప్రతిపాదన బిల్లులో ఉంది. దీంతో వేలాదిమంది భారత్‌ టెక్కీలకు ప్రయోజనం చేకూరనుంది. ఇక ఈ బిల్లులో హెచ్‌–1బీ వీసాదారుల భాగస్వాములకు పనిచేయడానికి అవకాశం, వారి పిల్లలకు వయసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం కల్పించే సదుపాయాల్ని పొందే అవకాశం వస్తుంది. గ్రీన్‌ కార్డు వచ్చిన వారు మూడేళ్లలోనే అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

ఎంతో ఉదాత్తంగా రాశారు
ట్రంప్‌ లేఖపై బైడెన్‌ ప్రశంసలు
వాషింగ్టన్‌ : వైట్‌హౌస్‌ వీడి వెళ్లడానికి ముందు డొనాల్డ్‌ ట్రంప్‌ తనకు రాసిన లేఖ చాలా ఉదాత్తంగా, గొప్పగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రశంసించారు. ఆ లేఖలో ఏముందో ఆయన వెల్లడించలేదు. కొత్త అధ్యక్షుడిని అభినందించడం సహా అన్ని రకాల సంప్రదాయాలను తోసి రాజని శ్వేత సౌధాన్ని వీడి వెళ్లిన ట్రంప్‌ లేఖ రాసే ఆనవాయితీ మాత్రం పాటించారు. ఫ్లోరిడాకు వెళ్లే ముందు ఓవల్‌ ఆఫీసులోని రిజల్యూట్‌ డెస్క్‌ దగ్గర లేఖని ఉంచిన విషయం తెలిసిందే.

ఐరాస హర్షం
ఐక్యరాజ్యసమితి:  ప్రపంచ ఆరోగ్య సంస్థలో తిరిగి చేరుతున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తొలి రోజే ఉత్తర్వులు జారీ చేయడంపై ఐక్యరాజ్య సమితి హర్షం వ్యక్తం చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుట్టెరస్‌కు బైడెన్‌ లేఖ రాశారు. డబ్ల్యూహెచ్‌ఒలో మళ్లీ చేరుతామని పేర్కొన్న ఆయన కరోనా కట్టడికి సంస్థ తీసుకుంటున్న చర్యల్ని ప్రశంసించారు. ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్యం కోసం డబ్ల్యూహెచ్‌ఓ చేస్తున్న కృషిని అభినందించారు. అమెరికా తిరిగి రావడాన్ని స్వాగతించిన గుట్టెరస్‌ ప్రపంచ దేశాల్ని అల్లకల్లోలం చేస్తున్న  కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి అందరూ సమైక్యంగా పోరాడాల్సిన సమయం ఇదేనని అన్నారు.  డబ్ల్యూహెచ్‌ఓకు  అగ్రరాజ్యమే అత్యధికంగా నిధులిస్తుంటుంది.

మరిన్ని వార్తలు