ఏం చేసినా బరువు తగ్గడం లేదా.. తప్పు మీది కాదు బ్యాక్టీరియాది

17 Sep, 2021 08:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సియాటెల్‌/వాషింగ్టన్‌: ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతకీ ఫలించడం లేదా? కడుపు కట్టుకున్నా.. రకరకాల వ్యాయామాలు చేస్తున్నా.. ఎంతకీ బరువు తగ్గడం లేదా? అయితే తప్పు మీది కాకపోవచ్చు. మీ జీర్ణ వ్యవస్థలో తిష్టవేసుకున్న కొన్ని రకాల బ్యాక్టీరియా మీరు బరువు తగ్గకుండా అడ్డుకుంటూ ఉండవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రయత్నపూర్వకంగా బరువు తగ్గిన.. తగ్గని వారి పేవుల్లోని సూక్ష్మజీవులను పరిశీలించడం ద్వారా ఈ విషయం స్పష్టమైంది. అమెరికాలోని సియాటెల్‌ కేంద్రంగా పనిచేస్తున్న సిస్టమ్స్‌ బయాలజీ అనే సంస్థ ఇటీవల ఒక పరిశోధన నిర్వహించింది. 

బరువు తగ్గాలని నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్న సుమారు వంద మందితో ఈ పరిశోధన జరిగింది. వీరిలో 50 మంది ఆరు నుంచి పన్నెండు నెలల్లోపు శరీర బరువులో ఒక శాతం తగ్గిన వారు కాగా... మిగిలిన వారు ఏమాత్రం బరువు తగ్గనివారు. రక్తం, మలం, జన్యుపదార్థాలను క్షుణ్ణంగా విశ్లేషించినప్పుడు రెండు వర్గాల వారి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మన జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని పులియబెట్టడం ద్వారా జీర్ణం చేసేందుకు అనువుగా అభివృద్ధి చెందిందని, అదే సమయంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం కూడా బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్టియన్‌ డైనర్‌ తెలిపారు. 

ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారు పిండి పదార్థాలను శరీరం శోషించుకోగల చక్కెరలుగా మలచుకోవడంలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారన్నారు. బ్యాక్టీరియా పెరుగుదల మందగిస్తే తిన్న ఆహారంలోని పీచుపదార్థం పులిసేందుకు ముందుగానే చక్కెరలుగా మారిపోయి రక్తంలోకి చేరిపోతాయని, ఫలితంగా బరువు తగ్గడం అసాధ్యంగా మారుతుందని వివరించారు. ఊబకాయులు ఒకొక్కరికీ వేర్వేరు చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు.  
 

మరిన్ని వార్తలు