100 రోజులు ఒకే డ్రెస్‌ వేసుకుంది.. కారణం

9 Jan, 2021 11:53 IST|Sakshi
బ్లాక్‌ డ్రెస్‌లో సారా రాబిన్స్‌ కోల్

వాషింగ్టన్‌ : ఈ రోజు వేసుకున్న డ్రెస్‌.. రేపు మళ్లీ వేసుకోవటం అంటే నూటికి తొంభైశాతం మందికి ఇష్టముండదు. రోజుకో డ్రెస్‌లాగా..వేసిన డ్రెస్‌ మళ్లీ వేయకుండా నెల రోజులు కలర్‌ఫుల్‌గా బ్రతికేవారూ ఉన్నారు. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా వంద రోజులు ఒకే డ్రెస్‌ వేసుకుంది. ఫ్యాషన్లకు దూరంగా.. సింపుల్‌గా జీవించింది. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని బోస్టన్‌కు చెందిన 52 ఏళ్ల సారా రాబిన్స్‌ కోల్‌ ‘100 రోజులు.. ఒకే డ్రెస్‌’ చాలెంజ్‌ను స్వీకరించింది. గత సెప్టెంబర్‌ నుంచి నిన్న మొన్నటి వరకు బ్లాక్‌ మెరినో ఊల్‌ డ్రెస్ వేసుకుంది‌ . ఫ్యాషన్లకు దూరంగా ఉంటూ సాధారణ జీవితాన్ని గడిపింది. ఉద్యోగానికి.. చర్చికి.. ఆఖరికి కిస్మస్‌ పండుగ రోజు కూడా అదే బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుంది. అయితే అప్పుడప్పుడు దాని మీదకు సరిపోయేలా రంగుల జాకెట్లు, ష్కర్టులు ధరించేది. (సార్‌! రోడ్డు పక్క ఓ కాలు తెగిపడి ఉంది..)

ఈ 100 రోజుల చాలెంజ్‌ను ఓ డాక్యూమెంటరీగా రూపొందించింది. సోషల్‌ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది.  100 రోజులు ఒకే డ్రెస్‌ చాలెంజ్‌ తీసుకున్న వారిలో సారా మొదటి వారేమీ కాదు. ‘ఉల్‌ అండ్’‌ అనే వస్త్ర కంపెనీ ఈ చాలెంజ్‌ను తీసుకొచ్చింది. ‘‘ మేము రొవెనా స్వింగ్‌ డ్రెస్‌ను తయారు చేశాము. సాదాసీదాగా జీవించటం, జాగ్రత్తగా వాడుకోవటం, మంచిగా ఉంచుకోవటం.. వంటి సూత్రాలతో 100 రోజుల చాలెంజ్‌ను ఇస్తాము. మా చాలెంజ్‌ను స్వీకరించే 50 మందికి ఈ డ్రెస్‌ను పంపిస్తాము’’ అని తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ( వైరల్‌: ఛీ, ఎందుకురా ఆడుకుంటారు? )

మరిన్ని వార్తలు