మార్చి 1 నుంచి హెచ్‌1–బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

31 Jan, 2022 05:17 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత టెకీలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే హెచ్‌1–బీ వీసాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని అమెరికా కంపెనీలు ఈ వీసాల కింద ఉద్యోగాల్లో నియమించుకుంటాయి. 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 1 నుంచి మార్చి 18 వరకు జరుగుతుందని అమెరికా సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఒక ప్రకటనలో వెల్లడించింది.

హెచ్‌1–బీ వీసాలను ఆశించే వారు, కంపెనీ ప్రతినిధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్‌కు 10 డాలర్ల రుసుము (రూ.750) చెల్లించాలి. ఆ తర్వాత లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి మార్చి 31లోగా వీసా వచ్చిన వారికి తెలియజేస్తామని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని హెచ్‌1–బీ వీసా ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అమెరికా కాంగ్రెస్‌ చేసిన చట్టం ప్రకారం ప్రతీ ఏడాది యూఎస్‌సీఐఎస్‌ 65 వేల హెచ్‌1–బీ వీసాలను మంజూరు చేస్తుంది. అవే కాకుండా అమెరికా యూనివర్సిటీ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌ సబ్జెక్టుల్లో) అంశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల హెచ్‌1–బీ వీసాలను ఏటా మంజూరు చేస్తుంది. ఈ వీసాల్లో అగ్రభాగం భారతీయ టెక్కీలకే దక్కుతుంటాయి.

మరిన్ని వార్తలు