Von Der Leyen-Putin: రష్యా మెలిక.. ‘ఇది దారుణం.. అస్సలు బాలేదు’

27 Apr, 2022 20:36 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులని పశ్చిమ దేశాలు తప్పుబట్టింది. ఈ దాడులను ఆపాలని ఎంత చెప్పినా ఫలితం లేకపోడంతో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తానేమి తక్కువ కాదని రష్యా కూడా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే పశ్చిమ దేశాల ఆంక్షల నుంచి తమ దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఓ నిర్ణయం తీసుకుంది.

ఇకపై రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయాలనుకునే దేశాలు.. ముఖ్యంగా అవి తమ మిత్రదేశాలు కాకపోతే రష్యా కరెన్సీ (రూబెల్స్)లోనే చెల్లింపులు ఉండాలని లేదంటే సరఫరా చేయబోమని రష్యా మెలికపెట్టింది. తాజాగా ఈ నిబంధనల ప్రకారం.. రూబెల్స్‌లో చెల్లింపులు చేయడంలో విఫలమైన పోలాండ్, బల్గేరియాకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. కాగా యూరోపియన్ దేశాలకు అత్యధికంగా గ్యాస్, చమురు సరఫరా చేసేది రష్యానే. ప్రస్తుతం ఈ నిర్ణయంతో ఆ దేశాల మార్కెట్‌లో హోల్‌సేల్ గ్యాస్ ధర 20% పెరిగింది. ఇది గత సంవత్సరం క్రితం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ.

యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ చర్యను ఖండించారు. ఆమె దీనిపై స్పందిస్తూ.. యూరోప్‌లోని వినియోగదారులకు గ్యాస్ డెలివరీని నిలిపివేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రష్యా చేస్తోంది బ్లాక్‌మెయిలింగ్ అని దుయ్యబట్టారు. తాము అన్ని సభ్య దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నామని,  గ్యాస్ సమస్యను తీర్చేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేశామని అది యూరప్ వెలుపల ఉన్న దేశాలతో చర్చలు జరుపుతోందని ఆమె తెలిపారు.

చదవండి: Karachi University Blast: ఇద్దరు పిల్లల తల్లి, సైన్స్‌ టీచర్‌.. మహిళా సుసైడ్‌ బాంబర్‌ గురించి షాకింగ్‌ విషయాలు

మరిన్ని వార్తలు