కరోనాకు వ్యాక్సిన్లు రావడం ఓ భ్రమేనా!?

28 Nov, 2020 18:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏడాదిలో కరోనాకు వ్యాక్సిన్లు భ్రమే

ఏడాదిలోనే వ్యాక్సిన్లు కనుగొనడంపై అనుమానాలు

సందేహాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన టీబీ లాంటి వ్యాధులకు వ్యాక్సిన్లు కనుగొనేందుకు గతంలో కనీసం పదేళ్లు పట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 22 కోట్ల మంది మలేరియా బారిన పడుతూ, వారిలో దాదాపు 50 లక్షల మంది మరణిస్తున్నా నేటికి మలేరియాను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు. అలాంటిది ఏడాది క్రితం ఆవిర్భవించిన కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్లను కనుగొన్నామంటూ, త్వరలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామంటూ ఫైజర్‌–బయోఎన్‌టెక్, ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనేకా, మోడర్న సంస్థలు ప్రకటించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా కొంత మంది వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, తాము కంపెనీలు ప్రకటిస్తున్న ఏ కరోనా వ్యాక్సిన్లను తీసుకోమంటూ కొంత మంది దేశాధినేతలే ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉంది. ఏడాదిలో కరోనాకు వ్యాక్సిన్లు కనుగొనడం ఓ భ్రమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

టీబీ, మలేరియా అంతటి ప్రాణాంతకం కానీ కరోనా వైరస్‌ పట్ల అనవసర భయాలను సృష్టించడమే కాకుండా, కాసుల కోసం వ్యాక్సిన్లు కనుగొన్నట్లు నాటకమాడుతున్నాయన్నది కూడా కొంత మంది పరిశోధకులు, దేశాధినేతల అనుమానం. ఏడాది కాలంలోనే కరోనాకు వ్యాక్సిన్లు కనుగొనడమే ప్రధానంగా వారి అనుమానాలకు కారణంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఉన్నట్లుగా నేడు వైద్య విజ్ఞాన పరిశోధన రంగం లేకపోవడమే కాకుండా, వైద్య రంగం పట్ల ప్రభుత్వాల పనితీరు, వైఖరులు మారడం వల్ల ఏడాదిలో వ్యాక్సిన్లను తయారు చేసి, ఉత్పత్తిచేసేందుకు నేడు ఎంతైనా వీలుందని కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో ‘ట్రాన్స్‌లేషనల్‌ బయోమెడికల్‌ రిసర్చ్‌’ డైరెక్టర్‌ మార్క్‌ తోష్నర్‌ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పరిశోధనల విషయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను కూడా ఆయన గుర్తు చేశారు. (కరోనా మూలాలు ఇండియాలో : చైనా శాస్త్రవేత్తలు)

‘నాకు పనిలో ఏ మాత్రం బద్ధకం లేదు. వ్యాక్సిన్‌ పరిశోధనలకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వాధికారులకు ప్రతిపాదనలను పంపించేవాణ్ని. వాటిని వారు తిరస్కరించేవారు. మళ్లీ పంపించేవాణ్ణి. మళ్లీ తిరస్కరించేవారు. మళ్లీ మళ్లీ పంపించేవాణ్ని. ఆమోదించకుండా, తిరస్కరించకుండా పక్కన పడేసేవారు. కాళ్లరిగేలా తిరిగితే ఎప్పటికో నిధులు మంజూరయ్యేవి. అవి కూడా విడతల వారిగా విడుదలయ్యేవి. వ్యాక్సిన్‌ కనుగొన్నాక ట్రయల్స్‌ పూర్తవడానికి కొన్ని నెలలు, ఏళ్లు పట్టేది. ఆ తర్వాత ఎథిక్స్‌ కమిటీ అనుమతి కోసం నెలలపాటు నిరీక్షించాల్సి వచ్చేది. ఆ తర్వాత వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఫార్మాస్యూటికల్‌ కంపెనీలను ఎంపిక చేయడానికి ‘రెగ్యులేటర్లు’ ఎంతో సమయం తీసుకునేవారు. చివరకు అన్ని తతంగాలు పూర్తి చేసుకున్నాక వ్యాక్సిన్‌ మందు మార్కెట్లోకి రావడానికి పదేళ్లు కూడా దాటేది’ అని మార్క్‌ తోష్నర్‌ తన స్వీయానుభవాలను పరోక్షంగా చెప్పారు. నాడు ఇలాంటి పరిస్థితి ఒక్క బ్రిటన్‌లోనే కాకుండా అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలన్నింటిలో ఉండేది. (చదవండి: వ్యాక్సిన్ల పనితీరును ఎలా లెక్కిస్తారు?!)

మరిన్ని వార్తలు