అమెరికా అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా

23 Apr, 2021 04:25 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రముఖ పౌర హక్కుల మహిళా న్యాయవాది, భారతీయ మూలాలున్న వనితా గుప్తా(46) అమెరికా ప్రభుత్వంలో కీలకమైన పదవిని అధిరోహించనున్నారు. వనితా గుప్తాను అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా ఎంపిక చేస్తూ అమెరికా సెసేట్‌ నిర్ణయం తీసుకుంది. అమెరికా న్యాయశాఖ విభాగంగా మూడో అత్యున్నత పదవి అయిన అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా శ్వేతజాతీయేతర వ్యక్తి ఎంపికకావడం ఇదే తొలిసారి. ఈ పదవికి ఎంపికైన తొలి పౌర హక్కుల లాయర్‌ కూడా వనితనే కావడం గమనార్హం.

ఎంపిక విషయంలో సెనేట్‌లో బుధవారం జరిగిన ఓటింగ్‌లో వనితకు మద్దతుగా రిపబ్లికన్‌ మహిళా సెనేటర్‌ లీసా ముర్కోవ్‌స్కీ ఓటు వేశారు. దీంతో 51–49 ఓట్లతో వనిత ఎంపిక ఖాయమైంది. ఒకవేళ ఓటింగ్‌ ‘టై’ అయితే తన ఓటును వినియోగించుకునేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ సెనేట్‌కు వచ్చారు. సెనేట్‌ రెండు పార్టీలకు చెరో 50 మంది సభ్యులు ఉన్నారు. వనిత 28 ఏళ్ల వయసులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బరాక్‌ ఒబామా హయాంలో పౌర హక్కులకు సంబంధించి అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.  
 

మరిన్ని వార్తలు