బైడెన్‌ వలస చట్టంపై హోరాహోరీ 

27 Jan, 2021 00:48 IST|Sakshi

రెన్‌టన్‌: బైడెన్‌ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక తీసుకువచ్చిన వలస చట్టాల సంస్కరణలకు మంచి మద్దతు లభిస్తోంది. పలువురు వలస హక్కుల కార్యకర్తలు ఈ మార్పులకు విస్తృత ప్రచారం కల్పిస్తూ బైడెన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. యునైటెడ్‌ వియ్‌ డ్రీమ్, యునైటెడ్‌ ఫామ్‌ వర్కర్స్‌ ఫౌండేషన్‌లాంటి గ్రూపులు సోషల్‌ మీడియాలో #వియ్‌ ఆర్‌ హోమ్‌ క్యాంపైన్‌ను నిర్వహిస్తున్నాయి. పలు కీలక రంగాల్లో వలసదారుల అవసరాన్ని వివరించే వీడియోలతో ఈ క్యాంపైన్‌ను హోరెత్తిస్తున్నారు. బైడెన్‌ తెచ్చే ప్రతిపాదిత సవరణలకు ఆమోదం లభిస్తే దాదాపు 1.1 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీనికి సెనేట్‌లో దాదాపు 60 వోట్ల మద్దతు కావాలి. కానీ డెమొక్రాట్లకు 50 వోట్లు మాత్రమే ఉన్నాయి. అందుకే ఇతర సెనేటర్లపై ఒత్తిడికి ఇమ్మిగ్రెంట్‌ హక్కుల కార్యకర్తలు యత్నిస్తున్నారు. ఈ యత్నానికి బలమైన మద్దతు లభిస్తోందని సంబంధితవర్గాలు తెలిపాయి.

కేవలం ఆన్‌లైన్‌ ప్రచారం మాత్రమే కాకుండా సెనేట్‌లో లాబీయింగ్‌ వరకు తమ ప్రయత్నాలుంటాయని క్యాంపైన్‌ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ బిల్లు వల్ల అమెరికన్లకు ఇబ్బందులు తప్పవని వ్యతిరేక ప్రచారకులు చెబుతున్నారు. 1986లో రీగన్‌ తెచ్చిన సవరణతో లక్షల మంది వలసదారులు అమెరికాను ముంచెత్తారని గుర్తు చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందడమంటే సరిహద్దులు తెరిచినట్లేనని హెచ్చరిస్తున్నారు. బిల్లు వ్యతిరేకుల్లో ద ఫెడరేషన్‌ ఫర్‌ అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ రిఫార్మ్‌ లాంటి సంస్థలున్నాయి. ఇరుపక్షాలు గట్టిగా యత్నిస్తుండడంతో ఇమ్మిగ్రేషన్‌ బిల్లు అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ఆన్‌లైన్‌ సర్వేల్లో మాత్రం ప్రస్తుతానికి బిల్లుకు మద్దతుగానే ఎక్కువమంది ఓట్‌ వేస్తున్నారు.    

మరిన్ని వార్తలు