కమలా గెలిచినట్టే.. తమిళనాడులో వెలసిన పోస్టర్లు

17 Aug, 2020 11:16 IST|Sakshi

పోస్టర్లను ట్వీటర్‌లో షేర్‌ చేసిన కమలా మేనకోడలు మీనా హారిస్‌

వాషింగ్టన్‌ : అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్య పదవికి డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌(55) విజయం సాధించినట్టేనని తమిళనాడులో ఓ పోస్టర్ వెలిసింది. దీన్ని ఆమె మేనకోడలు, కాలిఫోర్నియాకు చెందిన న్యాయవాది మీనా హారిస్‌(35) ట్వీటర్‌లో షేర్‌ చేశారు. తనకు తమిళనాడు నుంచి ఈ పోస్టర్ అందిందని, ‘పీవీ గోపాలన్ మనవరాలు విజయం సాధించింది’ అని దీని కింద తమిళంలో రాసి ఉందని ఆమె వెల్లడించారు. ‘నా చిన్నప్పుడు చెన్నైకి మా కుటుంబంతో వెళ్ళినప్పుడల్లా మా ముత్తాత గురించి తెలుసుకువాళ్లం. మా బామ్మకు ఆయన కొండంత అండగా ఉండేవాడు.  ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారనుకుంటా’అని మీనా పేర్కొన్నారు.
(చదవండి : అగ్రరాజ్యంలో ‘కమల’ వికాసం!)

కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైలోనే జన్మించారు. ప్రభుత్వ అధికారి అయిన పీవీ గోపాలన్ కూతురే ఆమె. కమలా తండ్రి జమైకాకు చెందిన నల్లజాతీయుడు డొనాల్డ్‌ హారిస్‌. కమలకు ఏడేండ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.కమల హోవర్డ్‌ వర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. 2010, 2014లో రెండుసార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేశారు. కమలా హారిస్ అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో తమిళనాడులోని ఈమె కుటుంబం సంతోషంతో తలమునకలవుతోంది. (చదవండి : డెమోక్రాట్లను గెలిపిస్తే భారత్‌కు మేలు)

మరిన్ని వార్తలు