రోడ్డు దాటుతున్న జనాలను కారుతో తొక్కించి.. భయంకర దృశ్యాలు వైరల్‌

12 Jan, 2023 15:55 IST|Sakshi

BMW Car Accident In China: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై ఓ లగ్జరీ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు. సౌత్‌ చైనాలోని గ్వాంగ్‌జూ ప్రావిన్స్‌లోని సిగ్నల్‌ కూడలి వద్ద బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

టియాన్హే జిల్లాలోని గ్రాండ్‌వ్యూ మాల్ సమీపంలో రద్దీగా ఉన్న జంక్షన్‌ వద్ద ఓ వ్యక్తి తన బ్లాక్‌ బీఎండబ్ల్యూ కారును రోడ్డు దాటుతున్న జనాలను వేగంగా డీకొట్టాడు. తర్వాత అతను యూటర్న్ తీసుకొని మళ్లీ జనాలపైకి కారును పోనిచ్చాడు. కారు కింద పడి అయిదుగురు మరణించగా.. 13మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదానికి సంబంధించిన భయంకర దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వీటిని పరిశీలిస్తే వ్యక్తి ఉద్ధేశపూర్వంగానే కారుతో జనాలను తొక్కించినట్లు  తెలుస్తోంది.  పాదాచారుల్ని ఢీకొట్టిన తర్వాత డ్రైవింగ్‌ సీట్లోని వ్యక్తి కారు నుంచి బయటకు వచ్చి నోట్లను విసిరేస్తూ కనిపించాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించారు. నిందితుడిని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జియాంగ్‌కు చెందిన 22 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు