పార్లమెంటులో ఎంపీల బాహాబాహీ.. పిడిగుద్దుల వర్షం

29 Dec, 2021 16:51 IST|Sakshi

Jordan Maps Brawl In Parliament Viral:  చట్ట సభలకు గౌరవం ఇవ్వడం మాట అటుంచి.. నేతలు దాడులకు తెగబడుతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే పశ్చిమ ఆసియా దేశం జోర్డాన్‌లో చోటు చేసుకుంది.  


మంగళవారం జోర్డాన్‌ పార్లమెంట్‌లో ‘సమాన హక్కు’కు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం మీద చర్చ జరిగింది. ఆ సమయంలో విపక్ష ఎంపీ ఒకరు చట్టం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని అధికార పక్షం పట్టుబడింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి.. గల్లా గల్లా పట్టుకుని కొట్టుకునేంతదాకా వెళ్లారు.

మహిళా సభ్యులు పక్కనే ఉన్నా పట్టనట్లు ఒకరినొకరు బండబూతులు తిట్టుకుంటూ తోసేసుకున్నారు. ఈ క్రమంలో సభ్యులు కిందపడగా.. కాసేపటికి సిబ్బంది వచ్చి వాళ్లను బయటకు తీసుకెళ్లారు. ఎవరికీ గాయాలు కాలేదు. పార్లమెంట్‌లో జరిగిన ఈ ఘటన దేశానికే అవమానమని, ప్రపంచవ్యాప్తంగా దేశ పరువు పోయిందంటూ ఎంపీ ఖలీల్‌ అతియేహ్‌ అంటున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు