అఫ్గాన్‌లో పరిస్థితి ఆందోళనకరం

10 Jul, 2021 05:50 IST|Sakshi

రష్యాతో సంతృప్తికరంగా చర్చలు

భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌

మాస్కో/వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌:  అఫ్గానిస్తాన్‌లో హింస పెరుగుతుండడంపై భారత్‌ ఆందోళన వెలిబుచ్చింది. తక్షణమే హింసను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. ఆ దేశాన్ని ఎవరు పాలించాలనే విషయంలో చట్టబద్ధత’ను కూడా ముఖ్యమైన అంశంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అఫ్గానిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నామని మాస్కోలో శుక్రవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్‌తో సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ ఆధీనంలో 85% అఫ్గాన్‌ భూభాగం ఉందని శుక్రవారం తాలిబన్‌ ప్రకటించింది. 30 ఏళ్లుగా అఫ్గాన్‌లో శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని జైశంకర్‌ చెప్పారు. రష్యా విదేశాంగ మంత్రితో సంతృప్తకరంగా చర్చలు జరిగాయని తెలిపారు.

ఆగస్ట్‌తో మా మిషన్‌ పూర్తి: బైడెన్‌
ఆగస్ట్‌ 31 వరకు అఫ్గానిస్తాన్‌లో తమ మిలటరీ మిషన్‌ పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.  20 ఏళ్లుగా అఫ్గాన్‌లో అమెరికా చేపట్టిన సైనిక కార్యక్రమానికి లక్ష కోట్ల డాలర్ల వరకు ఖర్చు అయిందని, 2,448 మంది యూఎస్‌ సైనికులు చనిపోయారని, 20 వేల మందికి పైగా గాయాల పాలయ్యారని బైడెన్‌ వివరించారు. మరో తరం అమెరికన్లను అఫ్గానిస్తాన్‌కు పంపించబోమన్నారు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకుంటారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి దిగజారుతోందని పాకిస్తాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ సివిల్‌ వార్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది.

మరిన్ని వార్తలు