2,500 ఏళ్ల తరువాత 'మమ్మీ'ని బయటకు తీశారు

6 Oct, 2020 11:43 IST|Sakshi

కైరో: ఈజిప్టు చరిత్రను చూస్తే మమ్మీలు గుర్తుకు రాక మానవు. ఏళ్ల నాటి మమ్మీలను వెలికి తీసి వాటి చరిత్రను తవ్వి తీయడంలో అక్కడి సైంటిస్టులు కూడా ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం ఆరంభంలో సక్కారా ప్రాంతంలో 59 మమ్మీలను వెలికి తీశారు. సక్కారా అనేది ఈజిప్టులో విస్తారమైన, పురాతన శ్మశానవాటిక. ఇక్కడ వెలికి తీసిన మమ్మీలు దాదాపు 2,500 ఏళ్ల క్రితానికి చెందినవిగా గుర్తించారు. శనివారం రోజున అందుకు సంబంధించిన ఓ శవపేటికను ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్తలు తెరిచారు.

బయటకు తీసిన శవపేటికలు, అందులోని మమ్మీలు కూడా చెక్కుచెదరకుండా ఉండటాన్ని గుర్తించారు. ఇవి ఈజిప్టు సమాజంలోని పూజారులు, ఇతర గొప్ప వ్యక్తులువిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈజిప్ట్‌ పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ తన ఖాతాలో పోస్ట్‌లో చేయగా.. ఇప్పుడది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈజిప్టులోని న్యూజిలాండ్ రాయబారి గ్రెగ్ లూయిస్ కూడా శనివారం ట్విటర్‌లో అన్‌సీలింగ్ వీడియోను పంచుకున్నారు. 

ఈ వీడియోలో శవపేటికలో మమ్మీ వస్త్రంతో చుట్టబడి, ఏమాత్రం పాడవకుండా ఉంది. ఈజిప్టు పురావస్తు శాఖ షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటిదాకా 9 మిలియన్ల మంది వీక్షించారు. దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. 2020 సంవత్సరంలో ఒక మిలీనియా పాత శవపేటికను తెరవడం ఉత్తమమైన చర్య కాకపోవచ్చు అంటూ ఓ నెటిజన్‌ చమత్కరించారు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ప్రకారం, పాప్‌ సంస్కృతిలోని జానపద కథల్లో మమ్మీలను తెరవడం ద్వారా మరణాలకు, శాపాలకు దారితీస్తుందనే అపోహ కూడా ఉంది.   (ఒక ఫొటో ఎంపీకి నిద్ర లేకుండా చేస్తోంది!)

కాగా.. ఈజిప్టు పర్యాటక, పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం మొదట 13 శవపేటికలతో మూడు బావులు సక్కారాలో కనుగొనబడ్డాయి. ఆ తర్వాత మరో 14 శవపేటికలు బయటపడ్డాయి. అలా ఈ రోజు వరకు మొత్తం 59 శవపేటికలను వెలికితీశారు. అయితే వీటిని గిజాలోని కొత్త గ్రాండ్‌ ఈజిప్టియన్‌ మ్యూజియానికి తరలించి ప్రదర్శన కోసం ఉంచనున్నారు. 

మరిన్ని వార్తలు