మాస్క్‌ లేదని ట్రైన్‌ నుంచి దిగమన్నారు, వినలే.. తోసేశారు

18 Jul, 2021 16:54 IST|Sakshi

ప్రస్తుతం ప్రజలు కరోనా మహమ్మారితో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం తప్పని సరిగా మారాయి. వైరస్‌ వ్యాప్తి అడ్డుకట్టకు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని అన్ని దేశాలు తమ ప్రజలకు సూచనలే గాక ఆంక్షల రూపంలో కూడా చెప్తున్నాయి. ఇక వీటిని ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాయి.

కొందరు మాత్రం వీటిని పట్టించుకోకుండా తమ రూటే సెపరేటు అనేలా ప్రవర్తిస్తున్నారు. నిర్లక్ష్యంతో వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ముప్పు లోకి నెట్టేస్నున్నారు. కాగా ఇటీవల అలా మాస్క్‌ ధరించని వారిపై జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా స్పెయిన్‌లో జరిగిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. లోకల్‌ మెట్రో ట్రైన్‌లో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా మాస్క్‌ ధరించకుండా ప్రయాణించాలని ప్రయత్నించాడు. కాగా ఇది గమనించిన కొందరు ప్రయాణికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాస్క్‌ లేని కారణంగా ఆ వ్యక్తిని రైలు నుంచి దిగిపోవాలని చెప్పారు. అయితే ఆ మాటలు వినకపోవడంతో ‍ప్రయాణికుల్లో ఇద్దరు మహిళలు దిగాల్సిందిగా ఆ వ్యక్తిని బలవంతంగా డోర్‌ వద్దకు తీసుకువెళ్లారు. అయితే అతను కొంత సేపు ప్రతిఘటించిన చివరకు ఆ ఇద్దరు మహిళలు అతడిని బలవంతంగా ట్రైన్‌ డోర్‌ నుంచి ఫ్లాట్‌ఫారం మీదకు తోసేశారు. ఈ వ్యవహారమంతా స్టేషన్‌లో రైలు ఆగి ఉండగానే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆ మహిళలకు మద్దతు తెలపగా, మరి కొందరు అలా ప్రవర్తించాల్సిన అవసరం లేదంటు కామెంట్లు పెడుతున్నారు.

>
మరిన్ని వార్తలు