లాక్‌డౌన్‌లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది

17 Oct, 2021 17:58 IST|Sakshi

కరోనా వైరస్‌ కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది దీన్నే అవకాశంగా మలుచుకని తమ జీవితాలను మూడుపూవులు ఆరుకాయల్లా మార్చుకున్నారు. ఆ కొంతమందిలో అమెరికాలోని అలబామా, పెల్‌ సిటీకి చెందిన 32 ఏళ్ల బ్రాంట్లీ గెర్హార్డ్ట్ ఒకడు. లాక్‌డౌన్‌ సమయంలో అతనికొచ్చిన ఓ ఐడియా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే.. గ్రిన్చ్‌ ( ఒళ్లంతా జుట్టు ఉండే ఓ వింత జంతువు) వేషాన్ని ధరించి ఆ పరిసరాలు మొత్తం చక్కర్లు కొట్టడం. అలా ఎందుకంటే.. లాక్‌డౌన్‌ సమయం కాబట్టి పిల్లల్ని బయటికి రాకుండా చూడటం వారి తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారింది. 

కనుకు అతను పిల్లలను భయపెట్టి వాళ్లు ఇళ్లలోంచి బయటకు రాకుండా చూడాలి. అతడి ఆలోచన నచ్చి భార్య సరేనంది. దీంతో అతడు గ్రిన్చ్‌ వేషంలో దగ్గరలోని నిత్యవసర వస్తువుల దుకాణాలు తిరగటం మొదలుపెట్టాడు. అలా ప్రతీ షాపు దగ్గర కొంత సేపు చక్కర్లు కొట్టేవాడు. కొంతమంది పిల్లలు అతడ్ని చూసి భయపడగా, మరికొంతమంది ఫొటోలు తీసుకోవటానికి ఎగబడేవారు. అలా కొంత మేర డబ్బు సంపాదించిన అది సరిపోయేది కాదు. 

ఓ రోజు గ్రిన్చ్‌ దుస్తుల్లో బ్రాంట్లీని చూసిన ఓ వ్యక్తి తన పిల్లల్ని భయపెట్టాలని, అందుకోసం 20 డాలర్లు (సుమారు 1500రూపాయలు) ఇస్తానని అన్నాడు. ఆ రోజు నుంచి గత సంవత్సరం వరకు ఆ వ్యక్తి పిల్లలను భయపెట్టేందుకు దాదాపు 20 వేల కుటుంబాలను కలుసుకున్నాడు. రోజుకు కనీసం 20 ఇళ్లలోని పిల్లల్ని భయపెడుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. ఇందులోనూ కొత్తదనం కోరుకుంటూ ఎప్పటికప్పుడు తన వేషాలను మారుస్తూ జెట్‌ స్పీడుతో దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం ఆ నగరంలో అతనో సెలబ్రిటీలా మారిపోయాడు దీంతో అతడితో ఫొటోలు దిగటానికి జనం ఎగబడుతున్నారట. ప్రస్తుతం అతను పిల్లల్ని భయపెట్టడానికి 30 డాలర్లు(2,251రూపాయలు) వసూలు చేస్తున్నాడు.  ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు కదా.. బహుశా అది ఇదేనేమో.

చదవండి: Niloufer Cafe Hyderabad: కప్పు చాయ్‌ రూ.1000.. ఎక్కడో తెలుసా?

మరిన్ని వార్తలు