కూల్‌డ్రింక్‌ ఆర్డర్‌ చేస్తే.. యూరిన్‌ బాటిల్‌ వచ్చింది!

23 Feb, 2021 14:56 IST|Sakshi

లండన్‌: చల్లచల్లగా కూల్‌డ్రింక్‌ తాగుదాం అనుకున్న ఓ వ్యక్తికి ఓ ఫుడ్‌ డెలివరీ కంపెనీ దిమ్మతిరిగే షాకిచ్చింది. అతడు ఇచ్చిన ఆర్డర్‌ ప్రకారం కూల్‌డ్రింక్‌ బాటిల్‌ పంపింది. కానీ అందులో యూరిన్‌ నింపి ఉంది. ఈ దారుణ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఒలీవర్‌ మెక్‌మానస్‌ లాక్‌డౌన్‌లో భోజనం ఆర్డర్‌ చేశాడు. అందులో కూల్‌డ్రింక్‌ కూడా ఉంది. అయితే ఆర్డర్‌ అందుకున్నాక బాటిల్‌లో ఉన్నది ఏదో తేడాగా కనిపించింది. తీరా అది మనిషి యూరిన్‌ అని అర్థం కావడంతో అతడికి కడుపులో దేవినట్లైంది. ఆకలితో ఉన్న నాకు ఇలా యూరిన్‌ బాటిల్‌ పంపుతారా అని ఆవేశంతో ఊగిపోయాడు.

యూరిన్‌ నింపిన కూల్‌డ్రింక్‌ బాటిల్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ దాన్ని పంపిన హెల్లో ఫ్రెష్‌ యూకే కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ అడ్రస్‌ చెప్తే దీన్ని మీకు పంపిస్తానని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఇంకేముందీ అతడి ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారగా ఏం జరిగిందో వివరించి చెప్పండి అంటూ జనాలు అతడి వెంటపడ్డారు. దీంతో ఇదెక్కడి గోలరా నాయనా అనుకున్న మెక్‌ తెల్లవారేసరికి ఆ ట్వీట్‌ డిలీట్‌ చేశాడు. అయితే అప్పటికే ఈ వార్త దావానంలా వ్యాపించగా మేలుకొన్న హలో ఫ్రెష్‌ కంపెనీ సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పింది. జరిగిన తప్పిదానికి మీకు ఎలా క్షమాపణలు చెప్పాలో అర్థం కావడం లేదని చింతిస్తూ ట్వీట్‌ చేసింది.

అయితే ఈ బాటిల్‌కు ఆ కంపెనీకి అసలు ఎలాంటి సంబంధమే లేదట. ఆ కంపెనీ కేవలం భోజనం పంపుతుందే తప్పఎటువంటి కూల్‌డ్రింక్స్‌ పంపదని నెటిజన్లు అంటున్నారు. కాకపోతే డెలివరీ బాయ్‌ మూత్ర విసర్జన చేసే సమయం లేకపోవడంతో బాటిల్‌లోనే కానిచ్చేసి ఉంటాడని, ఆ సంగతి మర్చిపోయి ఆ బాటిల్‌ను నేరుగా కస్టమర్‌కు డెలివరీ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మెక్‌ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇది డెలివరీలో జరిగిన పొరపాటు కావచ్చని చెప్పుకొచ్చాడు.

చదవండి: భర్త జూమ్‌ కాల్‌లో బిజీగా ఉండగా, భార్య ఏం చేసిందంటే..

సెల్ఫీ కోసం బిత్తిరి పని, పోలీసుల ఎంట్రీతో..

మరిన్ని వార్తలు